Telugu Global
Telangana

టికెట్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు

ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ కుటుంబంలో మరో వ్యక్తి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు.

టికెట్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు
X

తెలంగాణ అసెంబ్లీకి మరో ఏడాదిన్నర లోపే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అప్పుడే ఆశావాహులు టికెట్ల ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఫలానా పార్టీ గెలుస్తుందనే నమ్మకంతో వలస బాట పట్టే వారు కొందరైతే.. అధికార పార్టీ టికెట్ కోసం ఆశించేవారు మరి కొందరు. ఇప్పటికే తెలంగాణ రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో టికెట్ల కోసం వేట మొదలైంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ టికెట్ ఓ కుటుంబంలో ముసలానికి తెరలేపింది.

ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ కుటుంబంలో మరో వ్యక్తి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. తండ్రిని కాదని తనకే టికెట్ వచ్చేలా కొడుకు జీవన్ లాల్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది. ఐఆర్ఎస్ క్యాడర్‌లో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవలే ఆయనకు ఐటీ శాఖ కమిషనర్‌గా పదోన్నతి కూడా లభించింది. అయినా సరే రాజకీయాల వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రికి బదులు తాను పోటీ చేస్తానంటూ సన్నిహితుల దగ్గర తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం.

Advertisement

వైరా నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. గత మూడు దఫాలుగా ఏ వ్యక్తి రెండో సారి ఎన్నిక కాలేదు. 2009లో బానోతు చంద్రావతి సీపీఐ తరపున, 2014లో బానోతు మదన్‌లాల్ వైసీపీ తరపున గెలిచారు. అయితే మదన్‌లాల్ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో మదన్‌లాల్‌ టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేశారు. అయితే అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన లావుడ్య రాములు నాయక్ విజయం సాధించారు. ఆ తర్వాత రాములు నాయక్ టీఆర్ఎస్‌లో చేరారు.

Advertisement

అయితే ఈ సారి ఎవరు గెలుస్తారనే దానిపై అంచనాలు వేయడం కష్టమైపోతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్‌పై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని క్యాడర్ అంటోంది. రాములు నాయక్ బదులు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని టీఆర్ఎస్ క్యాడర్ చెప్తోంది. వైరాలో రాములు నాయక్, మదన్‌లాల్ వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయని.. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు వారి ఓటమి కోసం ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. అందుకే ఈ సారి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

కాగా, ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నత హోదాలో ఉన్న రాములు నాయక్ కొడుకు జీవన్ లాల్ రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతున్నారు. గత కొంత కాలంగా నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతూ క్యాడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి యూత్‌కు చేరువయ్యేందుకు ట్రై చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశిస్తే టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని జీవన్ లాల్ స్వయంగా చెప్పడంతో కుటుంబంలో ముసలం ప్రారంభమైంది.

కొడుకు జీవన్ లాల్ వైఖరితో రాములు నాయక్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. స్వయంగా కొడుకే తన టికెట్‌కు ఎసరు పెడుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇటీవల జీవన్ లాల్ ఐటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం వచ్చారు. ఆ సమయంలోనే తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కొడుకును వైరా టీఆర్ఎస్ క్యాండిడేట్‌గా ప్రచారం చేస్తున్న కొంత మందిని తన క్యాంపు ఆఫీసుకు రావొద్దని ఇప్పటికే రాములు నాయక్ ఆర్డర్ పాస్ చేశారు. దీంతో తండ్రి కొడుకుల కారణంగా అక్కడ మరో గ్రూప్ రెడీ అయ్యింది. టికెట్ ఎవరికి వస్తుందో తెలియక పోయినా.. ఇప్పుడు ఈ కుటుంబ తగాదాలు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఈ విషయాన్ని కొంత మంది స్థానిక నాయకులు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది.

Next Story