Telugu Global
Telangana

తెలంగాణలో పని అవదని షర్మిలకు అర్థమైందా? ఏపీకి తిరుగు ప్రయాణం ?

మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా వైఎస్‌ షర్మిల గురించి, ఆమె పార్టీ గురించి, జగన్‌కు ఆమెకు మధ్య జరుగుతున్న విషయాల గురించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొద్దిగా పక్కాగానే సమాచారం ఇస్తుంటారు.

తెలంగాణలో పని అవదని షర్మిలకు అర్థమైందా? ఏపీకి తిరుగు ప్రయాణం ?
X

మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా వైఎస్‌ షర్మిల గురించి, ఆమె పార్టీ గురించి, జగన్‌కు ఆమెకు మధ్య జరుగుతున్న విషయాల గురించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొద్దిగా పక్కాగానే సమాచారం ఇస్తుంటారు. ఎందుకంటే షర్మిల టీమే స్వయంగా రాధాకృష్ణకు ఈ విషయాన్నీ చెప్పి రాయించుకుంటోందన్న ప్రచారం ఉంది. తాజాగా రాధాకృష్ణ.. కాంగ్రెస్‌కు షర్మిల దగ్గరవుతున్నారని వెల్లడించారు.

షర్మిలను కాంగ్రెస్‌కు దగ్గర చేసేందుకు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం నడుపుతున్నారని రాధాకృష్ణ రాశారు. నెల క్రితం ప్రియాంక గాంధీ, షర్మిల ఇద్దరూ సుధీర్ఘంగా ఫోన్‌లో చర్చలు జరిపారట.


తెలంగాణలో కలిసి పనిచేద్దామని.. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏపీలో చురుకైన పాత్ర పోషించాల్సిందిగా షర్మిలను కాంగ్రెస్‌ పార్టీ కోరిందని వెల్లడించారు. షర్మిల వల్ల తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ లాభం ఉంటోందని కాంగ్రెస్ భావిస్తోందని..అందులో భాగంగా ఏపీ బాధ్యతలను షర్మిలకు అప్పగించే ప్రతిపాదన ప్రియాంక గాంధీతో జరిగిన ఫోన్ సంభాషణల్లో వచ్చిందని అందుకు షర్మిల సూత్రప్రాయంగా అంగీకరించారని రాధాకృష్ణ వెల్లడించారు.

అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి పనిచేసి.. టీఎస్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగిస్తారన్న మాట. షర్మిల కూడా ఏపీ బాధ్యతలు తీసుకునేందుకు ప్రియాంక గాంధీ వద్ద అంగీకారం తెలిపారంటే.. ఆమెకు కూడా తెలంగాణలో తాను నెట్టుకురావడం కష్టమని అర్థమై ఉండాలి. కాబట్టి ఏపీకి తిరిగి వెళ్తే, కాంగ్రెస్‌లో చేరితే... జగన్‌ వెంట వెళ్లిపోయిన కాంగ్రెస్‌ నాయకులు, శ్రేణులు తిరిగి వెనక్కు వస్తాయని షర్మిల భావిస్తుండవచ్చు. అదే జరిగితే తమ నాయకులను, ఓటు బ్యాంకును ఎత్తుకెళ్లిన జగన్‌పై ప్రతికారం తీర్చుకునేందుకు కాంగ్రెస్‌కు వీలవుతుంది. ఆస్తులు పంచివ్వకుండా, తన కంపెనీల్లో ఇతరులెవరూ పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకుంటున్న జగన్‌కు తానేంటే చూపించవచ్చని షర్మిల భావిస్తుండవచ్చు.

అసలు సలహా ఎవరిచ్చారో గానీ ఏపీని వదిలేసి తెలంగాణలో పార్టీ పెట్టడం షర్మిల చేసిన అతి పెద్ద పొరపాటు. ఇక్కడ ఆమె శక్తి వృథా అవడమే తప్ప సాధించేది ఏమీ లేదన్నది ఎవరినీ అడిగినా చెబుతారు. ఏపీకి వెళ్తే జగన్‌పై అసంతృప్తితో ఉన్న వారినుంచి, కాంగ్రెస్‌పై అభిమానం ఉన్న వారి నుంచి షర్మిలకు మద్దతు రావొచ్చు.

First Published:  21 May 2023 4:26 AM GMT
Next Story