Telugu Global
Telangana

కేసీఆర్ ముందుజాగ్రత్తే పార్టీని గెలిపించిందా..?

వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడే పార్టీ గెలుపు సగం ఖాయమైంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఓట్ల లెక్కింపులో బయటపడింది. ఓట్లలెక్కింపులో రెండురౌండ్లు బీజేపీకి మరో రెండు రౌండ్లలో టీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చింది.

కేసీఆర్ ముందుజాగ్రత్తే పార్టీని గెలిపించిందా..?
X

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకంట్ల ప్రభాకరరెడ్డి గెలిచారు. హోరాహోరీగా జరిగిన ఫైట్ లో కూసుకుంట్ల 10,309 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై విజ‌యం సాధించారు. పైకి కనబడుతున్న ఈ గెలుపు, మెజారిటీ ఎలా సాధ్యమైంది.. ? అంటే అచ్చంగా కేసీఆర్ ముందుచూపు వల్ల మాత్రమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకీ కేసీఆర్ ముందుజాగ్రత్త ఏమిటంటే వామపక్షాలతో పొత్తులు పెట్టుకోవటమే. నియోజకవర్గంలో వామపక్షాలకు బలమైన నాయకత్వంతో పాటు క్యాడర్ కూడా ఉంది.

వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడే పార్టీ గెలుపు సగం ఖాయమైంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఓట్ల లెక్కింపులో బయటపడింది. ఓట్లలెక్కింపులో రెండురౌండ్లు బీజేపీకి మరో రెండు రౌండ్లలో టీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చింది. చౌటుప్పల్, మునుగోడు మున్సిపాలిటీల్లో తనకు భారీ ఆధిక్యత ఖాయమని కోమటిరెడ్డి బలంగా నమ్మారు. రౌండు రౌండుకు మారుతున్న మెజారిటీ కారణంగా చివరి రౌండు వరకు ఫలితం తేలదనే టెన్షన్ రెండు పార్టీల్లోను పెరిగిపోయింది.

మొదటి నాలుగు రౌండ్లు చౌటుప్పల్ మండలం ఓట్లు కాబట్టి మెజారిటీ అటు ఇటు ఊగింది. కానీ ఎప్పుడైతే 5వ రౌండు ఓట్ల లెక్కింపు మొదలైందో మెజారిటీ టీఆర్ఎస్ వైపు మొగ్గింది. దీనికి కారణం ఏమిటంటే 5-10 రౌండ్ల మధ్య సీపీఎం బలంగా ఉన్న సంస్ధాన్ నారాయణపూర్, మునుగోడు, చండూరు మండలాలు ఉండటమే. పై మండలాల్లో టీఆర్ఎస్ కు వచ్చింది కొద్ది మెజారిటీనే అయినప్పటికీ బీజేపీని పూర్తిగా వెనక్కునెట్టేసింది.

దీనితర్వాత 11వ రౌండు నుంచి మర్రిగూడ, గట్టుప్పల్, నాంపల్లి ఓట్లతో 15వ రౌండు వరకు టీఆర్ఎస్ కే మెజారిటీ వచ్చింది. దీనికి కారణం పై మండలాల్లో సీపీఐ బలంగా ఉండటమే. 10వ రౌండు వరకు టీఆర్ఎస్ ఓవరాల్ మెజారిటీతోనే ఉన్నా అది చాలా తక్కువే. కానీ ఎప్పుడైతే 11వ రౌండు ఓట్ల లెక్కింపు మొదలైందో అప్పటి నుండే మెజారిటీలో స్పష్టమైన ఆధిక్యత పెరిగింది. సీపీఐకి పట్టున్న మండలాల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ మెజారిటీ 5,761కి చేరుకుంది. దీంతోనే బీజేపీ ఓటమి ఖాయమని తేలిపోయింది. ఇక ఆ తర్వాత జరిగిన లెక్కింపు మొత్తంమీద 10 వేల మెజారిటీతో కూసుకుంట్ల గెలిచారు. వామపక్షాల మద్దతులేకపోతే టీఆర్ఎస్ గెలుపు సాధ్యంకాదని అర్థ‌మవుతోంది. ఈ విషయం గ్రహించే కేసీయార్ ముందుజాగ్రత్తగా వామపక్షాలతో పొత్తుపెట్టుకున్నది.

First Published:  7 Nov 2022 4:15 AM GMT
Next Story