Telugu Global
Telangana

ఆ ముగ్గురు రాష్ట్రంలో శాంతి భధ్రతలను నాశనం చేయదల్చుకున్నారా ? రాష్ట్రపతి పాలనకు వ్యూహమా ?

తెల‍ంగాణ‌ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చడానికి ప్రభుత్వానికి సహకరించాల్సిన, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపి సరి అయిన‌ మార్గంలో నడిచేట్టు చూడవల్సిన ప్రతిపక్షాలు పొద్దున లేస్తే తమ స్వంత రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నాయనే ఆరోపణలొస్తున్నాయి.

ఆ ముగ్గురు రాష్ట్రంలో శాంతి భధ్రతలను నాశనం చేయదల్చుకున్నారా ? రాష్ట్రపతి పాలనకు వ్యూహమా ?
X


తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. అధికార విపక్షాల మధ్య ప్రతి క్షణం యుద్ద వాతావరణం ఉంటుంది. గతంలో ఈ పరిస్థితి ఉన్నా హద్దులు దాటకపోయేది. కానీ ప్రస్తుతం అన్ని హద్దులను చెరిపేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెల‍ంగాణ‌ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చడానికి ప్రభుత్వానికి సహకరించాల్సిన, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపి సరి అయిన‌ మార్గంలో నడిచేట్టు చూడవల్సిన ప్రతిపక్షాలు పొద్దున లేస్తే తమ స్వంత రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నాయనే ఆరోపణలొస్తున్నాయి..

మరో వైపు కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందనే ఆరోపణలున్నాయి. పైగా కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ , గవర్నర్ల రూపంలో రాష్ట్ర పరిపాలనలో వేలు దూరుస్తోందని, ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తున్నదని ఇప్పటికే రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ లో కొత్తగా వైఎస్సార్ టీపీ అనే పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల తన పాద యాత్రల్లో మంత్రులపై, ఎమ్మెల్యేలపై బీఆరెస్ నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. అభ్యంతకర వ్యాఖ్యలతో ప్రతి రోజూ వార్తల్లో ఉండేందుకుప్రయత్నిస్తున్నారు. అక్కడితో ఆగకుండా తెలంగాణలో శాంతి భద్ర‌తల పరిస్థితులు సరిగా లేవని, కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ గవర్నర్ ను కలిసి విఙప్తి చేశారు. రేపో మాపో ఇదే విషయంపై రాష్ట్రపతిని కూడా కలుస్తానని ప్రకటించారు. నిజంగా తెలంగాణ పట్ల కనీస ప్రేమ ఉన్న ఎవరైనా ఈ రాష్ట్ర పాలనను కేంద్రం చేతులో పెట్టాలని కోరుకుంటారా ? అసలే రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న కేంద్రం రాష్ట్రపతి పాలన‌ విధిస్తే తెలంగాణ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో షర్మిలకు తెలియదా ? లేక బీజేపీ డిమాండ్ ను తన గొంతు ద్వారా వినిపిస్తున్నారా ?

ఆమె అంటే నిన్నటి దాకా ఆంధ్రాలో రాజకీయాలు చేసి, అన్న కోసం ఆంధ్రప్రదేశ్ లో పాద యాత్రలు చేసి, జగన్ జైలుకెళ్ళినప్పుడు . వైఎస్సార్సీపీలో కీలక పాత్ర పోషించిన‌ ఆమెకు తెలంగాణ గురించిన అవగాహన కానీ, రాష్ట్రంపై ప్రేమగానీ లేదని అనుకుందాం. మరి తెలంగాణలోనే పుట్టి ఇక్కడే రాజకీయాలు చేస్తున్న బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఏమైనట్టు?

తన ఉపన్యాసాలతో విద్వేష వ్యాఖ్యలతో శాంతి భద్ర‌తల సమస్య వచ్చేట్టు బండి సంజయ్ చేస్తున్నారని బీఆరెస్ నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. సున్నిత ప్రాంతమైన నిర్మల్ జిల్లా భైంసాలో గొడవ‌లు జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా అక్కడే సభలు నిర్వహించడం, 'మసీదులు తవ్వుదాం శివుడొస్తే మాకు, శవమొస్తే మీకు' అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, కొత్త సచివాలయం మీదున్న డూమ్ లను కూలగొడతానని విద్వేష ప్రకటనలు చేయడంతో సరిపెట్టుకోకుండా తాజాగా వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యా ప్రయత్నాన్ని సాకుగా తీసుకొని మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సైఫ్ అనే సీనియర్ మెడికో ప్రీతిని వేధించడం, అవమానించడం వల్ల ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. సైఫ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇందులో ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. కానీ ఈ సంఘటనలో బండిసంజయ్ కు లవ్ జీహాది కనిపించింది. అసలు లవ్ జీహాదీ అనేది ఉందని తమ దృష్టికి రాలేదని కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెప్పినప్పటికీ బీజేపీ నాయకులు హిందువులను రెచ్చగొట్టి మత ప్రాతిపదికన ప్రజల మధ్య చీలిక తెచ్చి ఓట్లు పొందడం కోసం ఊహాజనిత లవ్ జీహాదీ నినాదాన్ని ఎత్తుకున్నారని అనేక మంది మేదావులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో బండి సంజయ్ లవ్ జీహాదీ నినాదం ఎత్తుకున్నారు. పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతి చనిపోయిందని ప్రకటించేశారు. అసలు లవ్వే లేని చోట లవ్ జీహాద్ ఎక్కడి నుంచి వచ్చిందని సోషల్ మీడియాలో నెటిజనులు బండి సంజయ్ పై దుమ్మెత్తి పోశారు. ఇలా విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న బండిసంజయ్ తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపణలు గుప్పిస్తునారు. దీని వెనక అసలు ప్రణాళిక ఏంటి ?

ఇక మూడో వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో కుమ్ములాటలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం లాంటి పరిస్థితులను చక్కదిద్దుకోలేని ఈయన బీఆరెస్ నాయకుల‌ పై వ్యక్తిగత దాడులకు దిగుతున్నాడు. అభ్యంతరకర‌ భాషను ఉపయోగించి అనేక చోట్ల బీఆరెస్ అభిమానులను రెచ్చగొడుతున్నాడు. పైగా ప్రగతి భవన్ ను కూల్చేస్తానని, నక్సలైట్లు గ్రైనేడ్లతో ప్రగతి భవన్ ను కూల్చేయాలని వ్యాఖ్యలు చేయడంతో పాటు తరిమి కొడతాం, వెంటప‌డతాం...లాంటి రెచ్చగొట్టే మాటలతో శాంతి భద్ద్రతలను నాశ‌నం చేసేందుకు కావాల్సినదంతా చేస్తున్నాడని బీఆరెస్ ఆరోపిస్తున్నది.

ప్రస్తుతం ఈముగ్గురు నాయకులు తెలంగాణ ప్రయోజనాలకోసం పనిచేస్తున్నారా లేక బీఆరెస్ పై కసితో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయదల్చుకున్నారా ? అనే చర్చ రాష్ట్రంలో సాగుతోంది. ఒక వేళ బీఆరెస్ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉంటే ప్రజలే ఆ పార్టీని ఓడిస్తారు. ఈ ముగ్గురు నాయకుల పట్ల ప్రజలకు నమ్మకం ఉంటే ప్రజలే వారిని గెలిపిస్తారు. అందుకోసం ప్రజల్లో విశ్వాసం పొందేందుకు పని చేయకుండా షార్ట్ కట్ లో అధికారంలోకి రావాలన్న కోరికతో వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారా ? లేక తెలిసే చేస్తున్నారా ? వీళ్ళ రెచ్చగొట్టే, విద్వేషపూరిత వ్యాఖ్య‌లవల్ల నిజంగానే శాంతిభద్రతల సమస్య వస్తే రాష్ట్రాన్ని కాపాడేవారెవరు ? రాష్ట్ర ఆదాయం తగ్గి వ్యవసాయం, పవర్, వైద్య, ఆరోగ్యం, విద్య తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపించి మళ్ళీ పాతరోజులకే వెళ్ళే పరిస్థితి వస్తే ఎవరు జవాబుదారీ ? తెలంగాణను ఆ పరిస్థితికి తీసుకరావద్దని ఆ ముగ్గురు నాయకులను కోరడం తప్ప మనమేం చేయగలం!

First Published:  26 Feb 2023 9:38 AM GMT
Next Story