Telugu Global
Telangana

మునుగోడు ఉపఎన్నిక విషయంలో కూడా బీజేపీ ఈడీనే నమ్ముకుందా?

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు మంగళవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఫెమా యాక్ట్ కింద నమోదైన కేసు విషయంలో కార్యాలయానికి పిలిచిన అధికారులు, అక్కడే సాయంత్రం వరకు ఉంచారు.

మునుగోడు ఉపఎన్నిక విషయంలో కూడా బీజేపీ ఈడీనే నమ్ముకుందా?
X

మునుగోడు ఉపఎన్నికలో గెలుస్తామనే ధీమా బీజేపీలో రోజు రోజుకూ సన్నగిల్లుతున్నట్లే ఉంది. క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకపోవడం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత ఉండటంతో బీజేపీకి గెలిచే దారులు కనపడటం లేదు. ఈ క్రమంలో నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు రావడం గమనార్హం. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ స్వలాభం కోసం వాడుకుంటుందని బీజేపీపై అనేక పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సీబీఐ, ఈడీ, ఐ-టీలను ప్రయోగిస్తోందనే విమర్శలు ఉన్నాయి.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు మంగళవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఫెమా యాక్ట్ కింద నమోదైన కేసు విషయంలో కార్యాలయానికి పిలిచిన అధికారులు, అక్కడే సాయంత్రం వరకు ఉంచారు. తర్వాత ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని చెప్పి పంపించారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2015లో ఇండోనేషియాలో గోల్డ్ మైన్స్‌లో పెట్టుబడులు పెట్టారు. వాటికి సంబంధించిన లావాదేవీలు క్రమం తప్పకుండా ఐటీ శాఖకు సమర్పిస్తున్నారు. అయితే కిషన్‌రెడ్డి అకౌంట్‌లోకి లెక్కల్లో లేని డబ్బు విదేశాల నుంచి వచ్చిందని ఆయనపై ఫెమా యాక్ట్ కింద కేసు నమోదు చేసి కొన్ని రోజుల క్రితమే నోటీసులు పంపించారు. మునుగోడు ఉపఎన్నికలో బిజీగా ఉన్న సమయంలోనే కిషన్‌రెడ్డికి నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించే నాయకులకు ఈడీ నోటీసులు పంపుతోంది. సీఎం కేసీఆర్‌ను మానసికంగా దెబ్బ తీసేందుకే తన చుట్టూ ఉన్న నేతలపై ఈడీ కేసులు బనాయిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, మునుగోడు ఉపఎన్నికలో కీలకంగా వ్యవహరిస్తున్న కిషన్‌రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేయడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చినట్లైంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మునుగోడులో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలు వేర్వేరు జిల్లాల్లో ఉన్నా.. నైసర్గీకంగా పక్క పక్కనే ఆనుకొని ఉంటాయి. దీంతో మంచిరెడ్డి కిషన్ రెడ్డి మునుగోడు బైపోల్ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఇంచార్జిగా ఉన్నా.. కొన్ని మండలాల్లో కిషన్ రెడ్డి ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్‌లోకి తీసుకొని రావడంలో చురుకుగా వ్యవహరించారు.

ఇటీవల స్థానికంగా ఉన్న కొంత మంది కీలక నేతలు కిషన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఫోకస్ అంతా మునుగోడు పైనే పెట్టారు. అదే సమయంలో ఎప్పుడో 2015లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి.. పది రోజుల క్రితం ఈడీ నోటీసులు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. కావాలనే కీలక నేతలను బీజేపీ సైడ్ చేస్తోందని, మునుగోడు బైపోల్ కోసం చివరకు ఈడీని కూడా వాడుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈడీ, సీబీఐ, ఐటీ ఏది వచ్చినా తాము భయపడేది లేదని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఇబ్బంది పెట్టినా.. మునుగోడులో మాత్రం గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

First Published:  28 Sep 2022 2:20 AM GMT
Next Story