Telugu Global
Telangana

టీఆర్ఎస్, కాంగ్రెస్‌ను బీజేపీ ఇలా దెబ్బకొట్టిందా?

రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న టీఆర్ఎస్ సహా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మునుగోడు ఉపఎన్నిక చాలా కీలకం. అక్కడ వచ్చే ఫలితం తప్పకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని అంచనా వేస్తున్నాయి.

టీఆర్ఎస్, కాంగ్రెస్‌ను బీజేపీ ఇలా దెబ్బకొట్టిందా?
X

మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బీజేపీ రెండు ప్రధాన పార్టీలను దెబ్బ కొట్టిందా? వేరే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని ఆందోళనలో పడేసిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. నిన్న, మొన్నటి వరకు మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. బీజేపీ కూడా ఉపఎన్నిక విషయంలో బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన దసరాకు చేస్తారనే వార్తలకు బలం చేకూరిందో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణలో భారత్ జోడో యాత్రలో ఉంటారో.. అప్పుడే ఉపఎన్నిక డేట్‌ను ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ కావాలనే రెండు పార్టీలు ఇతర పనుల్లో బిజీగా ఉన్న సమయంలో మునుగోడు ఉపఎన్నిక డేట్ ఫిక్స్ చేసిందనే చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న టీఆర్ఎస్ సహా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మునుగోడు ఉపఎన్నిక చాలా కీలకం. అక్కడ వచ్చే ఫలితం తప్పకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఓ వైపు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు సిద్ధమవుతున్న వేళ మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. కాబట్టి ఇది అధికార టీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైన ఎన్నిక అని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీనపడిపోతున్నది. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల్లో నమ్మకాన్ని, ఉత్సాహాన్ని నింపడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. రాష్ట్ర క్యాడర్ ఈ యాత్రను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నది. ఇప్పటికే రూట్ మ్యాప్‌తో పాటు యాత్రను విజయవంతం చేసే సన్నాహకాల్లో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఉన్నది.

రెండు కీలకమైన కార్యక్రమాల్లో ప్రధాన పార్టీలు ఉన్న సమయంలో మునుగోడు ఉపఎన్నిక ప్రకటన రావడం వెనుక బీజేపీ హస్తం ఉందనే చర్చ జరుగుతున్నది. మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున బరిలో ఉంటారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను తనవైపు తిప్పుకునే పనిలో ఉన్నారు. రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ క్యాడర్ మొత్తం తనతో వెంట వస్తారని రాజగోపాల్ రెడ్డి భావించినా.. అలా జరగలేదు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నది. అయితే గత వారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు బిజీగా ఉన్న విషయాన్ని వివరించారు. దాంతో పాటే ఇతర పార్టీల నుంచి చేరికలు ఊపందుకున్నట్లు వెల్లడించారు. అప్పటికే మునుగోడు ఉపఎన్నిక డేట్ దాదాపు ఫిక్స్ అయిన సమాచారం రాజగోపాల్‌కు అమిత్ షా చెప్పారు. వెంటనే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని కూడా సూచించారు.

బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగానే ఉపఎన్నిక డేట్ ఫిక్స్ చేసి టీఆర్ఎస్, కాంగ్రెస్‌ను దెబ్బకొట్టింది. ఉపఎన్నిక డేట్ రావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కాస్త ఆందోళన ఉన్నది. అయితే దసరా రోజు కేసీఆర్ చేసే ప్రకటన తప్పకుండా ఉత్సాహం తీసుకొని వస్తుందని అంటున్నారు. అలాగే భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీతో కూడా భారీ బహిరంగ సభ పెట్టించనున్నారు. బీజేపీ దెబ్బకొట్టినా.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

First Published:  3 Oct 2022 11:45 AM GMT
Next Story