Telugu Global
Telangana

దశాబ్ది సంబరం.. నేడు ఆధ్యాత్మిక దినోత్సవం

మత ప్రార్థనా నిలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తారు. తెలంగాణ మత సామరస్యానికి ప్రతీక అని చాటి చెబుతారు.

దశాబ్ది సంబరం.. నేడు ఆధ్యాత్మిక దినోత్సవం
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఆధ్యాత్మిత దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర మత ప్రార్ధనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలతోపాటు స్థానిక నాయకులు, అధికారులు కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలు, ఇతర మత ప్రార్థనా నిలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తారు. తెలంగాణ మత సామరస్యానికి ప్రతీక అని చాటి చెబుతారు.

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణలో ఆధ్యాత్మిక వైభ‌వం ఉట్టిప‌డుతోంద‌ని అన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. ఆధ్మాత్మిక దినోత్స‌వం సంద‌ర్భంగా దేవాదాయ శాఖ‌ ప్ర‌గ‌తి నివేదిక‌ను మంత్రి వెల్లడించారు. ఆధ్యాత్మిక చింత‌న క‌లిగిన సీఎం కేసీఆర్ తెలంగాణ సాంప్ర‌దాయాల‌కు, ఆల‌యాల‌కు, పండుగ‌ల‌కు, వేడుక‌ల‌కు అత్యంత ప్రాధ‌న్య‌త ఇస్తున్నార‌ని పేర్కొన్నారు. స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత మ‌న పండుగ‌ల‌కు, వేడుక‌ల‌కు ప్ర‌పంచ ఖ్యాతి ల‌భించింద‌న్నారు.

ఆలయాల అభివృద్ధి ఇలా..

దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని రూ.1,200 కోట్లతో పునర్నిర్మించారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధికి రూ.70 కోట్లు ఖర్చు చేశారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించారు. రూ.50 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, రూ.100 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, రూ.25 కోట్లతో కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు.

మసీదుల అభివృద్ధి..

పాతబస్తీలోని మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ, నవీకరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.8.48 కోట్లు మంజూరు చేసింది. కొత్తూర్ లోని జహంగీర్ పీర్ దర్గా సమగ్రాభివృద్ధి కోసం రూ.50 కోట్లు ఖర్చు చేసింది. కోకాపేటలో రూ.40 కోట్లతో తెలంగాణ ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ స్థాపనకు రూ.40 కోట్లు మంజూరు చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రిస్మస్ ను రాష్ట్ర పండగ‌గా గుర్తించింది ప్రభుత్వం. ప్రతి ఏడాదీ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో చర్చికి రూ. 2 లక్షల చొప్పున కేటాయించి క్రిస్మస్ విందులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది. క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రభుత్వం క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తోంది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2.85 లక్షల మందికి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. కోకాపేట్ లో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ. 10 కోట్లతో క్రిస్టియన్ భవన్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీంతో పాటు చర్చిలు, గ్రేవ్ యార్డుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక నిధులు సమకూరుస్తోంది. ఇతర అన్ని మతాలు, వర్గాల వారికి కూడా సమ ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ప్రభుత్వం లౌకిక స్ఫూర్తిని చాటి చెబుతోంది.

First Published:  21 Jun 2023 2:18 AM GMT
Next Story