Telugu Global
Telangana

కళ్లకున్న బీజేపీ తెర తొలగించుకుంటే అభివృద్ధి కనపడుతుంది.. గవర్నర్‌కు రెడ్కో చైర్మన్ సూచన

సీఎం కేసీఆర్ విజన్‌తో తెలంగాణలో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు అద్భుతంగా ఉన్నాయని నీతి ఆయోగ్ ప్రసంసించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

కళ్లకున్న బీజేపీ తెర తొలగించుకుంటే అభివృద్ధి కనపడుతుంది.. గవర్నర్‌కు రెడ్కో చైర్మన్ సూచన
X

గవర్నర్ తమిళిసై తన కళ్లకు ఉన్న బీజేపీ అనే తెరను తొలగించుకొని చూస్తే.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కనపడుతుందని రెడ్కో చైర్మన్ వై. సతీశ్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో ఏట అడుగు పెడుతున్న సందర్భంలో రాష్ట్రం గురించి గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు బాధకరమని అన్నారు. గవర్నర్‌గా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సింది పోయి.. అభివృద్ధే జరగడం లేదంటూ ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ లాగా మాట్లాడటం శోచనీయం అన్నారు. గవర్నర్ తమిళిసై మాట్లాడిన మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని.. ఇప్పుడు తెలంగాణ పల్లెలు అద్భుతంగా ఉన్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే అవార్డులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దేశంలోనీ బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణకి ఎక్కువ అవార్డులు ఇచ్చిందన్నారు. కేంద్రం 46 అవార్డులు ప్రకటిస్తే.. అందులో 13 అవార్డులు తెలంగాణ పల్లెలకు వచ్చాయని చెప్పారు. సీఎం కేసీఆర్ విజన్‌తో తెలంగాణలో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు అద్భుతంగా ఉన్నాయని నీతి ఆయోగ్ ప్రసంసించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. 100 శాతం ఓడీఎఫ్ గ్రామాలు ఉన్న రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. తెలంగాణలో ఎలాంటి అభివృద్ది లేకుండానే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ సందర్భంగా 20కి 19 అవార్డులు ఇచ్చారా అని గవర్నర్‌ను ప్రశ్నించారు.

రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను పక్కన పెట్టి.. సర్కారుకు ప్రతీ పనిలో అడ్డుతగులుతూ.. ఇప్పుడు అభివృద్ధి జరగడం లేదని మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. గత పాలకులు తమ స్వార్థ, ఆర్థిక ప్రయోజనాల కోసం అభివృద్ధిని హైదరాబాద్‌కు పరిమితం చేశారు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందని సతీశ్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తెలంగాణలో రోడ్లు లేని గ్రామాలు లేవని అన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని చెప్పారు.కానీ, ఇవన్నీ తెలియనట్లు గవర్నర్ తమిళిసై తెలంగాణపై అబద్దాలు ప్రచారం చేయడం బాధకరమని సతీశ్ రెడ్డి చెప్పారు.

First Published:  3 Jun 2023 2:30 AM GMT
Next Story