Telugu Global
Telangana

పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పరువు తీసేశారు

కంటోన్మెంట్ యువత పేరుతో వెలసిన ఈ పోస్టర్లు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పాలంటూ కొన్ని పోస్టర్లలో బండి సంజయ్ పరువు కూడా తీసేశారు.

పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పరువు తీసేశారు
X

విమోచన దినోత్సవం అంటూ పరేడ్ గ్రౌండ్స్ లో బలప్రదర్శన చేద్దామనుకున్న బీజేపీ పరువు ఆ పరేడ్ గ్రౌండ్స్ దగ్గరే పోయినట్టయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని ప్రశ్నిస్తూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ తెల్లారేసరికల్లా పోస్టర్లు వెలిశాయి. తెలంగాణకు ఏమిస్తావ్ అమిత్ షా.. అంటూ ఆ పోస్టర్ల ద్వారా ప్రశ్నించారు. విలీనాన్ని, విమోచనం అంటూ రెచ్చగొట్టడానికి వస్తున్న అమిత్ షా.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఎందుకివ్వలేదని, కనీసం ఈరోజైనా ప్రకటన చేస్తారా లేదా అంటూ నిలదీశారు.

గోవాకు 300కోట్లు చదివించారే..?

గోవా లిబరేషన్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కేటాయించింది. మరి తెలంగాణకు మాత్రం సెప్టెంబర్-17 సందర్భంగా నిధులెందుకు ఇవ్వలేదని ఈ ఫ్లెక్సీల ద్వారా నిలదీశారు. టివోలీ చౌరస్తాతో పాటు పరేడ్‌ మైదానం చుట్టూ పెద్ద ఎత్తున ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

గతంలో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మోదీని ఇలాగే ఫ్లెక్సీల ద్వారా నిలదీశారు, ఇప్పుడు అమిత్ షా కి ఫ్లెక్సీలతో షాకిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఎలా సాయపడింతో చెప్పాలన్నారు. కంటోన్మెంట్ యువత పేరుతో వెలసిన ఈ పోస్టర్లు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పాలంటూ కొన్ని పోస్టర్లలో బండి సంజయ్ పరువు కూడా తీసేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకులు వీళ్లేనంటూ మరికొన్ని పోస్టర్లు కనిపించాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ 20 ప్రశ్నలను రూపొందించి పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లపై ఇంకా బీజేపీ స్పందించలేదు. తెల్లారేసరికి పరేడ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల ఇలా పోస్టర్లు కనిపించే సరికి ఒకరకంగా బీజేపీ నేతలు షాకయ్యారు.

First Published:  17 Sep 2022 4:37 AM GMT
Next Story