Telugu Global
Telangana

తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్.. వైద్య ఆరోగ్య శాఖ వివరణ

హైరిస్క్ ఏరియాలను గుర్తించి మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నారు. అవసరమైతే జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చేవారికోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు అధికారులు.

తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్
X

తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్

తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ములుగు జిల్లాలో డెంగీతో వారం రోజుల్లో 10మంది మరణించారనే వార్తలు వినపడుతున్నాయి. మీడియా, సోషల్ మీడియాలో కూడా డెంగీ వార్తలు హైలైట్ అవుతున్నాయి. అయితే వీటిలో నిజమెంత అనేదే ఇప్పుడు ప్రశ్న. తెలంగాణలో జ్వరపీడితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమే అయినా, డెంగీ కేసులతో ఎవరూ ఇబ్బంది పడటం లేదని, డెంగీ మరణాలు కూడా లేవని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తప్పుడు కథనాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దని సూచించింది.

ఒక్క డెంగీ మరణం కూడా లేదు..

ఈ సీజన్ లో ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కరు కూడా డెంగీ కారణంగా చనిపోలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఫీవర్ కేసులు కూడా ఆందోళనకర స్థాయిలో లేవని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ములుగు జిల్లాలో డెంగీ కేసులు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం కూడా అవాస్తవం అని తెలిపారు అధికారులు. ఈ ఏడాది జూన్‌ నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ఇంటింటి సర్వే చేపట్టి, విష జ్వరాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.

డెంగీతో మరణించారు అని అంటున్న నలుగురు ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయినట్టు నిర్థారణ అయిందని చెప్పారు వైద్య శాఖ అధికారులు. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, కామెర్లు వంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు చనిపోతే, అవి డెంగీ కేసులు అని చెబుతున్నారని ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. జ్వరపీడితుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్ లో నమోదు చేసి.. ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్‌వోలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. హైరిస్క్ ఏరియాలను గుర్తించి మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నారు. అవసరమైతే జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చేవారికోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. చిన్నపిల్లలు జ్వరంతో బాధపడుతుంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ప్రచారంతో ప్రజలు ఆందోళనకు గురికావొద్దని కోరారు అధికారులు.

First Published:  14 Sep 2023 4:15 PM GMT
Next Story