Telugu Global
Telangana

హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. అప్రమత్తంగా ఉండాలన్న వైద్యారోగ్య శాఖ

తెలంగాణ వ్యాప్తంగా గత 8 నెలల్లో 2,972 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. ఇందులో 1,562 కేసులు హైదరాబాద్‌లోనే గుర్తించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. అప్రమత్తంగా ఉండాలన్న వైద్యారోగ్య శాఖ
X

డెంగ్యూ జ్వరాలు హైదరాబాద్ నగరాన్ని వణికిస్తున్నాయి. ఒక్క నెలలోనే డెంగ్యూ కేసులు 10 రెట్లు పెరిగినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. సీజనల్ వ్యాధి అయిన డెంగ్యూ ఒకే నెలలో ఇంతలా పెరగడం ప్రజలను కలవరపెడుతోంది. జూలై నెలలో కేవలం 164 డెంగ్యూ కేసులు హైదరాబాద్‌లో నమోదు కాగా.. ఆగస్టులో ఏకంగా 1,171 కేసులకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు మాసాంతానికి హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయ్యాయని.. రాష్ట్రంలో గుర్తించిన కేసుల్లో సగం నగరంలోనే కనపడుతున్నాయిని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా గత 8 నెలల్లో 2,972 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. ఇందులో 1,562 కేసులు హైదరాబాద్‌లోనే గుర్తించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలను కూడా కలిపితే 75 శాతం కేసులు ఇక్కడే నమోదు అయినట్లు తెలుస్తున్నది. డెంగ్యూ అనేది ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లోనే వేగంగా వ్యాపిస్తుందని వైద్యారోగ్య శాఖ తెలియజేస్తోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా.. చాలా చోట్ల రోడ్లపై, నిర్మాణంలో ఉన్న భవనాల దగ్గర తీసిన భారీ గోతుల్లో, ఇతర ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. ఇవే నగరంలో డెంగ్యూ వ్యాప్తికి ముఖ్య కారణాలని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

డెంగ్యూకు కారణమయ్యే దోమలు ఏవైనా ఇళ్ల పరిసరాల్లోకి ఒక సారి వస్తే.. అవి వరుసగా గుడ్లు పెడుతూ భారీగా సంతానోత్పత్తి చేస్తాయని.. అవి ఏడాది తర్వాత పొదుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. గతేడాది డెంగ్యూ దోమలు పెట్టిన గుడ్లు.. ఇప్పుడు దోమలుగా వృద్ధి చెంది మనుషులపై దాడి చేయడం వల్ల కేసులు భారీగా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గతేడాది ఎవరికైనా డెంగ్యూ సోకినట్లయితే ఆ ఇంటిని శుభ్రంగా క్లీన్ చేయాలని.. చుట్టుపక్కల పరిసరాల్లో కూడా డెంగ్యూ గుడ్లు పెరగకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు.

ఇటీవల నమోదవుతున్న డెంగ్యూ కేసుల్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఓపీలకు వచ్చే వారిలో చాలా మందికి మైల్డ్ సింప్టమ్స్ ఉంటున్నాయి. కానీ కొద్ది మంది రోగులను ఐసీయూల్లో ఉంచి చికిత్స చేయాల్సి వస్తోందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

ఏడీస్ ఈజిప్టై దోమల కారణంగా డెంగ్యూ వ్యాపిస్తుంది. ఈ దోమలు ఎక్కువగా పగటి పూటే కాటు వేస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఫుల్ స్లీవ్స్ ఉండే బట్టలు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మొత్తం కప్పి ఉంచే దుస్తులు ధరించడం వల్ల ఈ దోమ కాటు నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే దోమల మందు పగటి పూట కూడా వాడటం.. చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల డెంగ్యూ నుంచి కాపాడుకోవచ్చని చెప్పారు.

చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం రాగానే అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్ వంటి మందులను సొంతంగా వాడేస్తున్నారు. అప్పటికి జ్వరం తగ్గినట్లు అనిపించినా డెంగ్యూ అయితే మాత్రం తర్వాత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని చెప్పారు. డెంగ్యూ అనేది వైరస్ కాబట్టి.. ఇంతకు ముందు పేర్కొన్న ఔషధాని దేనికీ పనికి రావని చెబుతున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

డెంగ్యూ లక్షణాలు..

తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, వికారం, కళ్ల వెనక నొప్పి, ఒంటిపై దద్దులు వంటివి డెంగ్యూ సాధారణ లక్షణాలు. ఈ వ్యాధి తీవ్రత పెరిగితే మూర్చ, విపరీతమైన కడుపు నొప్పి, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఓరిఫీస్ నుంచి రక్తస్రావం కావడం వంటి లక్షణాలు ఉంటాయి.

ఏం చేయాలి?

జ్వరాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ 48 గంటల పాటు పర్యవేక్షించాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే చేసుకోవద్దు.

First Published:  10 Sep 2023 1:45 AM GMT
Next Story