Telugu Global
Telangana

ప్రధాని రాకను నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికుల ప్రదర్శన‌

ప్రధాని రామగుండం పర్యటనను నిరసిస్తూ ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. టీజీబీకేఎస్‌, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనల్లో గో బ్యాక్ మోడీ అంటూ నినదించారు.

ప్రధాని రాకను నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికుల ప్రదర్శన‌
X

ఈ నెల 12న ప్రధాని మోడీ రామగుండం రానున్నారు. ఆయన ఆరోజు, ఏడాదన్నర కిందటే ఉత్ప్పత్తి ప్రారంభించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు అనేక ప్రశ్నలు, నిరసనలు ఎదురవుతున్నాయి.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదని తెలంగాణ ప్ర‌జలు మోడీ పై ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణకు చెందిన అనేక మంది ప్రొఫెసర్లు, రచయితలు, తదితర బుద్దిజీవులు 64 మంది ప్రధాని మోడీ కి బహిరంగ లేఖ కూడా రాశారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని,ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలి లేదా దానికి సమానమైన ఒక పథకాన్ని తెలంగాణకు ప్రకటించాలని,రాష్ట్రానికి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు కేటాయించాలని, తెలంగాణకు వైద్య కళాశాలలు, నవోదయ, ఐఐఎం లాంటి విద్యా సంస్థలను కేటాయించాలని, తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి వివక్ష లేకుండా కొనుగోలు చేయాలని,తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరిత, వివక్ష పూరిత పక్షపాత ధోరణిని విడనాడాలని, మతతత్వ ధోరణిని విడనాడి, దేశ ఐక్యతను, బహుళత్వాన్ని కాపాడుకొనే విధంగా పాలన సాగించాలని మేదావులు తమ లేఖలో డిమాండ్ చేశారు.

మరో వైపు సోషల్ మీడియాలో కూడా గో బ్యాక్ మోడీ అనే నినాదం ఊపందుకుంది. తెలంగాణకు ఇచ్చిన హామీలను పూర్తి చేశాకే మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా తెల‍ంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ప్రజలు, టీఆరెస్, వామపక్ష కార్యకర్తలు మోడీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు మోడీ గోబ్యాక్ అంటూ ప్రదర్శననిర్వహించారు. కార్మికులు నల్ల బాడ్జీలు ధరించి డ్యూటీలకు హాజరయ్యారు. బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్న బీజేపీ సర్కార్ విధానలపై కార్మికులు మండిపడ్డారు. టీజీబీకేఎస్‌, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా బొగ్గు గనుల వద్ద కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. మోడీ కార్మిక వ్యతిరేకి అని కార్మికనాయకులు ఈ సందర్భంగా ఆరోపించారు.

ఎల్లుండి రామగుండం రానున్న ప్రధాని మోడీ ఆ రోజు ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడమే కాక‌ బీజేపీ ఏర్పాటు చేసే బహిరంగం సభలో కూడా పాల్గొంటారు. ఆ సభకు జనాల తరలింపు కోసం తెలంగాణ బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. మరో వైపు అదే రోజు మోడీని అడ్డుకొని తీరుతామని, కార్మికులు, విద్యార్థులు, వామపక్ష సంఘాలు ప్రకటించాయి.

First Published:  10 Nov 2022 7:02 AM GMT
Next Story