Telugu Global
Telangana

సిట్టింగ్ సీట్లతోపాటు డిపాజిట్లు గల్లంతు.. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితేంటి?

ఐదు ఉప ఎన్నికల్లో ఓటమి ఓవైపు, అందులో మూడింట కనీసం డిపాజిట్ కూడా రాలేదనే దిగులు మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్ ని బాగా ఇబ్బందిపెడుతోంది.

సిట్టింగ్ సీట్లతోపాటు డిపాజిట్లు గల్లంతు.. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితేంటి?
X

మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. కానీ పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే జరిగింది. చివరకు కాంగ్రెస్ కి డిపాజిట్ గల్లంతయింది.

హుజూర్ నగర్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. కానీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది.

అంతే కాదు 2018 ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఆయా స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికిలపడిపోయింది.

ఐదు ఉప ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ కి డిపాజిట్ గల్లంతయింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా..? అసలు తెలంగాణ కాంగ్రెస్ కి ఏమైంది..?

తెలంగాణలో కాంగ్రెస్ గ్రేస్ తగ్గుతోందా..?

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రేస్ బాగా తగ్గిపోతోంది. 2018 ఎన్నికల్లో కేవలం 28.4 శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్ సాధించగలిగింది. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గెలిచినా వెంటనే అధికార పార్టీలోకి వెళ్లిపోవడం మరింత నష్టం చేకూర్చింది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కూడా వరుస ఓటములు కాంగ్రెస్ పరిస్థితిని దిగజార్చాయి.

దుబ్బాక ఉప ఎన్నికలో 13.48 శాతం ఓట్లతో డిపాజిట్ కోల్పోయింది కాంగ్రెస్. హుజూరాబాద్‌ లో బీజేపీ, టీఆర్ఎస్ భీకర యుద్ధంలో కేవలం 1.46 శాతం ఓట్లు సాధించి కాంగ్రెస్ మట్టికరిచింది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 10.58 శాతం. హుజూర్ నగర్ సిట్టింగ్ స్థానం ఎలాగూ పోయింది, నాగార్జున సాగర్ లో సీనియర్ నేత జానారెడ్డి సైతం ఓటమిపాలయ్యారు. ఐదు ఉప ఎన్నికల్లో ఓటమి ఓవైపు, అందులో మూడింట కనీసం డిపాజిట్ కూడా రాలేదనే దిగులు మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్ ని బాగా ఇబ్బందిపెడుతోంది.

కిం కర్తవ్యం..?

నాయకుల వలసబాట, ఉన్నవారిలో కుమ్ములాట. ఈ రెండూ తెలంగాణలో కాంగ్రెస్ ని ఇబ్బందిపెడుతున్నాయనేది వాస్తవం. తెలంగాణ కాంగ్రెస్ పై పెత్తనం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు, కానీ బాధ్యతగా పనిచేయమంటే మాత్రం ఒక్కరూ ముందుకు రారు. మునుగోడులో రేవంత్ రెడ్డి ఒంటరిపోరాటం చేసినా ఎవరూ కలసి రాలేదు. ఓ దశలో పీసీసీ ఆశించిన వెంకట్ రెడ్డి కూడా పార్టీ అభ్యర్థి ఓటమికి పరోక్షంగా కారణం అయ్యారు. నాయకుల మధ్య సమన్వయ లేమి స్పష్టంగా కనపడుతోంది. ఇలాంటి దశలో కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్ఎస్ కి ఏకైక ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడం హాస్యాస్పదమే. బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్ మరింత కష్టపడాలి. నాయకులు బయటకి రావాలి, కార్యకర్తల్లో ధైర్యం నింపాలి. 2024లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి అనుకూల పవనాలు వీస్తాయి అనుకుంటున్న దశలో.. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

First Published:  9 Nov 2022 2:52 AM GMT
Next Story