Telugu Global
Telangana

కేసీఆర్ స్ఫూర్తికి సలాం.. దీక్షా దివస్ కి ఎన్నారైలు సిద్ధం

చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు ఎన్నారై కువైట్ సంఘం నేతలు. దీక్షా దివస్ ని కువైట్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

కేసీఆర్ స్ఫూర్తికి సలాం.. దీక్షా దివస్ కి ఎన్నారైలు సిద్ధం
X

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాన్ని తుది ఘట్టానికి తీసుకెళ్లిన రోజు, చరిత్రను మలుపు తిప్పిన రోజు 2009 నవంబర్ 29. ఆరోజు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ సాధన తర్వాత ప్రతి ఏడాదీ నవంబర్ 29న దీక్షా దివస్ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా దీక్షా దివస్ ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. కోడ్ ఉల్లంఘన జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అటు విదేశాల్లో కూడా కేసీఆర్ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ దీక్షా దివస్ కి ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ ఎన్నారైలు.

చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు ఎన్నారై కువైట్ సంఘం నేతలు. దీక్షా దివస్ ని కువైట్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కువైట్ ఎన్నారైలు ఒకరోజు ముందుగానే సంబరాలు మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని, వారందరినీ స్మరించుకుంటూ దీక్షా దివస్‌ చేపట్టామన్నారు. కేసీఆర్‌ స్ఫూర్తితో తాము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నామని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణలో గత ఆరు దశాబ్దాలలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో జరిగిందని అన్నారు ఎన్నారైలు. రాబోయే రోజుల్లో ఇలాంటి అభివృద్ధి కొనసాగాలంటే కేవలం కేసీఆర్‌ వల్లనే సాధ్యం అవుతుందని చెప్పారు. కేసీఆర్‌ హ్యాట్రిక్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నారైల మద్దతు ఎప్పుడూ బీఆర్ఎస్ కి ఉంటుందని స్పష్టం చేశారు.

First Published:  28 Nov 2023 4:16 PM GMT
Next Story