Telugu Global
Telangana

లండన్ లో ఘనంగా దీక్షా దివస్

అటు కువైట్ లో కూడా ఒకరోజు ముందే దీక్షా దివస్ సంబరాలు జరిగాయి. ఇప్పుడు లండన్ లో సంబరాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఏ దేశంలో ఉన్నా.. అక్కడ దీక్షా దివస్ నిర్వహిస్తామని ఎన్నారై నేతలు చెబుతున్నారు.

లండన్ లో ఘనంగా దీక్షా దివస్
X

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. ఇక్కడ దీక్షా దివస్ సంబరాల విషయంలో నేతలు, కార్యకర్తలు ఆచితూచి అడుగేస్తున్నారు. విదేశాల్లో మాత్రం దీక్షా దివస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ కండువాలు మెడలో వేసుకుని, పార్టీ జెండాలు చేతబట్టుకుని.. కేసీఆర్ ఆమరణ దీక్ష ఫొటోలతో ఫ్లెక్సీలు వేయించి.. ఎన్నారైలు దీక్షా దివస్ ని ఘనంగా జరుపుకుంటున్నారు. లండన్ లో దీక్షా దివస్ ని బీఆర్ఎస్ యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేసిన శాంతియుత పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చుడో- కేసీఆర్‌ సచ్చుడో అనే నినాదంతో తలపెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి.. శాంతియుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు ఎన్నారైలు.

నాడు గాంధీ - నేడు కేసీఆర్..

భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ ఎంచుకున్న అహింసా పద్ధతినే.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ ఎంపిక చేసుకున్నారని తెలంగాణ అనివార్యం అనే పరిస్థితి తీసుకొచ్చి తెలంగాణ సాధించారని చెప్పారు ఎన్నారై బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎలాంటి హింసకు తావులేకుండా, శాంతియుతంగా ఉద్యమం కొనసాగించారన్నారు. శాంతియుతంగా ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి కేసీఆర్ గొప్ప సందేశాన్నిచ్చారన్నారు. ఉద్యమ నాయకుడే నేడు సేవకుడిగా.. తెలంగాణకు ముఖ్యమంత్రిగా రావడం అదృష్టమన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

అటు కువైట్ లో కూడా ఒకరోజు ముందే దీక్షా దివస్ సంబరాలు జరిగాయి. ఇప్పుడు లండన్ లో సంబరాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఏ దేశంలో ఉన్నా.. అక్కడ దీక్షా దివస్ నిర్వహిస్తామని ఎన్నారై నేతలు చెబుతున్నారు. దీక్షా దివస్ నిర్వహించుకుని కేసీఆర్ స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు.


First Published:  29 Nov 2023 6:02 AM GMT
Next Story