Telugu Global
Telangana

దశాబ్ది సంబరం.. నేడు సురక్ష దినోత్సవం

సురక్ష దినోత్సవం సందడి హైదరాబాద్ లో ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు అధికారులు.

దశాబ్ది సంబరం.. నేడు సురక్ష దినోత్సవం
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మూడో రోజుకి చేరుకున్నాయి. మొదటి రోజు ఆవిర్భావ దినోత్సవం, రెండో రోజు రైతు దినోత్సవం ఘనంగా ముగిశాయి. మూడో రోజు సురక్ష దినోత్సవం పేరుతో పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ పోలీస్ విజయాలు వివరించేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు. ఉదయం 9 గంటలనుంచి మొదలయ్యే కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకు జరుగుతాయి.

హైదరాబాద్ లో ఇలా..

సురక్ష దినోత్సవం సందడి హైదరాబాద్ లో ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు అధికారులు. పోలీస్‌ బ్యాండ్లతో ప్రదర్శన, పోలీస్‌ జాగృతి కళాకారుల బృందాల ప్రదర్శనలు, బాడీ కెమెరాలు, బ్రీత్‌ అనలైజర్లు మొదలైన పరికరాల గురించి ప్రజలకు వివరిస్తారు. పెట్రోలింగ్‌ కార్స్‌, బ్లూ క్లోట్స్‌, ఫైర్‌ వెహికిల్స్‌ తో ర్యాలీ నిర్వహిస్తారు. మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కవిత, మేయర్‌ విజయలక్ష్మి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌.. తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

- ఉదయం 9 గంటలకు ట్యాంక్‌ బండ్‌ నుంచి ఫ్లీట్ ర్యాలీ మొదలవుతుంది.

- సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ ఎక్స్ పో జరుగుతుంది.

- మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ట్యాంక్‌ బండ్‌ పై ఉమెన్‌ కార్నివాల్‌ జరుగుతుంది. హీరో నాని, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

- దుర్గం చెరువు వద్ద రాత్రి 8 గంటలకు డ్రోన్‌ షో నిర్వహిస్తారు.

- రాత్రి 9 గంటలకు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ టవర్‌ నుంచి కేబీఆర్‌ పార్‌ చుట్టూ ఫుట్‌ పెట్రోల్‌, మౌంటెడ్‌ పెట్రోల్‌ వాహనాల ప్రదర్శన ఉంటుంది.

జిల్లాల్లో ఇలా..

సురక్ష దినోత్సవం సందడి ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఉదయం పెట్రోలింగ్‌ కార్లు, బ్లూకోట్స్‌ వాహనాలు, అగ్నిమాపక వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఆయా జిల్లా, మండల పోలీస్‌ స్టేషన్లలో పోలీసుల ఆయుధాల ప్రదర్శన ఉంటుంది. ప్రత్యేకంగా బడాఖానా నిర్వహిస్తారు. హోంగార్డులు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీ.. అందరూ కలసి సహపంక్తి భోజనం చేస్తారు. ఈ బడాఖానాలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా పాల్గొంటారు.

First Published:  4 Jun 2023 3:10 AM GMT
Next Story