Telugu Global
Telangana

అమిత్ షా గారూ.. సెప్టెంబర్ 17 విషయంలో మీరు చెప్పేవి అబద్దాలు : మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబన్ 17ను అధికారికంగా నిర్వహిస్తోందని, ఆ రోజు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.

అమిత్ షా గారూ.. సెప్టెంబర్ 17 విషయంలో మీరు చెప్పేవి అబద్దాలు : మంత్రి కేటీఆర్
X

ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయిన సెప్టెంబర్ 17 గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేవన్నీ అబద్దాలే అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించదని, ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని అమిత్ షా ఆరోపించారు. ఆ రోజు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని కూడా పాటించడం లేదని అమిత్ షా చెప్పారు. దీనిపై తాజాగా కేటీఆర్ స్పందించారు.

తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబన్ 17ను నిర్వహిస్తోందని, ఆ రోజు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో అదే రోజు విలీనం అయ్యింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే సెలెబ్రేట్ చేస్తోందని మంత్రి చెప్పారు. కానీ కేంద్ర హోం మంత్రి హోదాలో ఉండి.. ఇలాంటి అబద్దాలు ప్రచారం చేయడం, తప్పుదోవ పట్టించడం మీకు అలవాటుగా మారిందని అమిత్ షాపై కేటీఆర్ మండిపడ్డారు. కావాలంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన న్యూస్ క్లిప్స్‌ను జత చేస్తున్నాను. మీరు వాటిని చూసి తెలుసుకోండని అమిత్ షాకు మంత్రి కేటీఆర్ సూచించారు.

సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించింది. ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. గౌరవ వందనం కూడా స్వీకరించారు. దీనికి సంబంధించి వార్తలు తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు పలు పత్రికలు, టీవీ ఛానల్స్‌లో వచ్చాయి. ఈ విషయాలు అన్నీ తెలిసినా.. హోం మంత్రి మాత్రం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారు. ప్రజలను పక్కదోవ పట్టించేలా కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతుండటంతో మంత్రి కేటీఆర్ గట్టి సమాధానం చెప్పారు.


First Published:  27 March 2023 5:04 AM GMT
Next Story