Telugu Global
Telangana

కాంగ్రెస్ - MIM మధ్య కుదిరిన డీల్!

కాంగ్రెస్ పార్టీపై అసదుద్దీన్ ఒవైసీ ఒత్తిడి తెస్తున్నారని టాక్. మీ పార్టీ నుండి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా హిందువును నిలబెట్టండి అని అసద్ ప్రెజర్ పెడుతున్నట్లు చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ - MIM మధ్య కుదిరిన డీల్!
X

హైదరాబాద్ ఎంపీ స్థానం MIM పార్టీకి కంచుకోటగా ఉంది. 1989 నుంచి 2019 వరకు MIM ఇక్కడ వరుసగా 9 సార్లు గెలిచింది. అంతకుముందు అసద్ తండ్రి సలాఉద్దీన్ ఒవైసీ, ఇపుడు అసదుద్దీన్ ఒవైసీ ఇక్కడ చక్రం తిప్పుతూ వస్తున్నారు. అంటే 35 ఏళ్లుగా ఇక్కడ మజ్లిస్ పార్టీదే ఆధిపత్యం. అయితే కాల క్రమేనా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఎంఐఎంపై, అసద్ కుటుంబంపై ముస్లిం కుటుంబాల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. యాకత్ పురా, మలక్ పేట్, చార్మినార్, చంద్రాయణ‌గుట్ట అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముస్లిం ఓటర్లు ఎంఐఎంపై అసంతృప్తిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో యాకత్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో MIM కేవలం 878 ఓట్లతో బయట పడటమే ఇందుకు నిదర్శనం.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న మజ్లిస్ పార్టీ అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలో ఆందోళన మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో అసద్ కి 5లక్షల 17 వేల 471 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి భగవంతురావుకి 2 లక్షల 35 వేల 285 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ కు 49,944 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి పుస్తె శ్రీకాంత్ కి 63,239 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధులు, నోటాకు కలిపి 15 వేల ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కనుక ఈసారి ముస్లిం అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే అసద్ గతంలో ఎప్పుడూ లేనంత గడ్డుకాలం ఎదురుకోక తప్పదు అనే టాక్ నడుస్తోంది. అంటే ఎంపీగా మళ్ళీ అసద్ గెలవాలన్నా, ఓడాలన్నా కాంగ్రెస్ దయా దక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది అని రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులని ప్రకటించేశాయి.

బీజేపీ నుంచి విరించి హాస్పిటల్ అధినేత్రి మాధవీలత బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను పోటీ చేయిస్తోంది. అధికార కాంగ్రెస్ మాత్రం ఇప్పటిదాకా అభ్యర్ధిని ప్రకటించలేదు. క్యాండిడేట్ ఎంపిక కోసం మల్లగుల్లాలు పడుతోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. కాంగ్రెస్ జాప్యం వెనుక అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారనే చర్చ జరుగుతోంది. నాలుగు పార్టీల మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో ఒకవేళ అటు ఇటు అయి ఓడిపోతే పరువు పోతుంది అని అసద్ ఆందోళన పడుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై అసదుద్దీన్ ఒవైసీ ఒత్తిడి తెస్తున్నారని టాక్. మీ పార్టీ నుండి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా హిందువును నిలబెట్టండి అని అసద్ ప్రెజర్ పెడుతున్నట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ముస్లింకు టికెట్ ఇస్తే ఎంఐఎం ఓట్లకు గండి పడుతుంది. ఓల్డ్ సిటీలో బిజెపి బలపడకూడదు అంటే మీరు కూడా బీఆర్ఎస్ లాగా ఒక హిందువుకు టికెట్ కేటాయించండి అని కాంగ్రెస్ పై అసద్ ఒత్తిడి పెంచినట్లు టాక్.

తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ కి దూరంగా ఉంటున్నారు అసదుద్దీన్ ఒవైసీ. అలాగే చంద్రాయణ‌గుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా మొన్నటి లండన్ పర్యటలో సీఎం రేవంత్ తో సన్నిహితంగా మెలిగారు. అసదుద్దీన్ ఒవైసీ అయితే ఎప్పుడు కలవడానికి కూడా ఇష్టపడని అజారుద్దీన్ తో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విషయంపై ముస్లిం నేతలు అజారుద్దీన్, షబ్బీర్ అలీ, అలీ మస్కతితో అసద్ సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కి, ఎంఐఎం కి డీల్ కుదిరిందా..! కాంగ్రెస్ ని మేనేజ్ చేస్తుంది అసదుద్దీన్ ఒవైసీ నేనా అన్న చర్చ మొదలైంది.

First Published:  8 April 2024 3:47 PM GMT
Next Story