Telugu Global
Telangana

డీఏవీ స్కూల్ కొత్త రూల్స్.. పేరెంట్స్‌కి కూడా సీసీ కెమెరాల యాక్సెస్

విద్యార్థి ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా పర్యవేక్షించేలా కొత్త రూల్స్ వచ్చాయి. సీసీ కెమెరాల యాక్సెస్ తల్లిదండ్రులకు కూడా కల్పించారు.

డీఏవీ స్కూల్ కొత్త రూల్స్.. పేరెంట్స్‌కి కూడా సీసీ కెమెరాల యాక్సెస్
X

ఎల్.కె.జి. స్టూడెంట్‌పై జరిగిన లైంగిక దాడితో రెండు తెలుగు రాష్ట్రాల్లో డీఏవీ స్కూల్ వార్తల్లోకెక్కింది. వెంటనే ఆ స్కూల్ అనుమతిని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడం, ఆ తర్వాత పేరెంట్స్ విజ్ఞప్తితో స్కూల్ తిరిగి ప్రారంభించడం తెలిసిందే. అయితే ఇప్పుడీ స్కూల్‌లో నిబంధనలు అన్నీ మారిపోయాయి. విద్యార్థి ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా పర్యవేక్షించేలా కొత్త రూల్స్ వచ్చాయి. సీసీ కెమెరాల యాక్సెస్ తల్లిదండ్రులకు కూడా కల్పించారు.

డ్రైవర్లకు నో ఎంట్రీ..

డీఏవీ స్కూల్‌కి కొత్త మహిళా ప్రిన్సిపాల్‌ని నియమించారు. ప్రతి క్లాస్ రూమ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యాజమాన్యంతోపాటు, తల్లిదండ్రులకు కూడా సీసీ టీవీ యాక్సెస్ ఇచ్చారు. బస్సుల్లో మహిళా అటెండర్‌లను నియమించారు. క్లాస్ రూమ్‌లోకి పిల్లలు, టీచర్లు మినహా ఇంకెవరూ వెళ్లడానికి వీలు లేకుండా చేశారు. ఇక నుంచి డ్రైవర్లకు స్కూల్ కాంపౌండ్‌లోకి అనుమతి లేదంటూ నో ఎంట్రీ బోర్డు పెట్టారు. డ్రైవర్లతో వచ్చేవారు కాంపౌండ్ బయటే కారు దిగి లోపలకు రావాల్సి ఉంటుంది. ఆటోలో వచ్చే స్టూడెంట్స్ సెక్యూరిటీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక నుంచి స్టూడెంట్స్ సెక్యూరిటీ విషయంలో కఠినంగా వ్యవహారిస్తామని కొత్త ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.

మాకు న్యాయం చేయండి..

మరోవైపు బాధిత ఎల్.కె.జి. విద్యార్థిని తల్లిదండ్రులు, స్కూల్ తిరిగి ప్రారంభం కావడంతో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయకుండా స్కూల్ తిరిగి ఎలా ప్రారంభిస్తారంటూ నిలదీశారు. వారికి అధికారులు సర్దిచెప్పారు. మిగతా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సహకరించాలన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. వారి పాపకు జరిగినట్టుగా ఇంకెవరి విషయంలోనూ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

First Published:  3 Nov 2022 11:23 AM GMT
Next Story