Telugu Global
Telangana

ముషీరాబాద్‌ నుంచి దత్తాత్రేయ కూతురు.. మరీ లక్ష్మణ్‌ పరిస్థితి..?

గతంలో ఇక్కడి నుంచి బీజేపీ తరపున ప్రాతినిథ్యం వహించిన డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1999, 2014 ఎన్నికల్లో ముషీరాబాద్‌ నుంచి డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఎమ్మెల్యేగా గెలిచారు.

ముషీరాబాద్‌ నుంచి దత్తాత్రేయ కూతురు.. మరీ లక్ష్మణ్‌ పరిస్థితి..?
X

హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మీ పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి విజయలక్ష్మీ ఎట్టకేలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. ముషీరాబాద్‌ స్థానం నుంచి ఆదివారం దరఖాస్తు చేసుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో ర్యాలీగా వచ్చిన విజయలక్ష్మీ పార్టీ ఆఫీసులో దరఖాస్తు సమర్పించారు. బీజేపీ నుంచి పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ప్రస్తుతం బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌గా ఉన్నారు. దత్తాత్రేయకు అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఏటా నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమం దత్తాత్రేయకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ప్రస్తుతం విజయలక్ష్మీ అలయ్ బలయ్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని ఆమె నిర్వహిస్తున్నారు. గతేడాది నిర్వహించిన అలయ్‌ బలయ్‌లో పొలిటికల్‌ ఎంట్రీపై కామెంట్స్ చేశారు విజయలక్ష్మీ. రాజకీయాల్లో తనకు ఛాన్స్ ఇచ్చే అంశంపై తుది నిర్ణయం పార్టీదేనని చెప్పారు.

ఇక పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లోనూ విజయలక్ష్మీ పాల్గొంటూ వచ్చారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రలోనూ చురుగ్గా పాల్గొన్నారు. విజయలక్ష్మీ మొదట సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ..చివరకు ముషీరాబాద్‌ నుంచే దరఖాస్తు చేసుకున్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు దత్తాత్రేయ. ప్రస్తుత ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. దీంతో తనకు ముషీరాబాద్‌ స్థానం కలిసి వస్తుందని విజయలక్ష్మీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఇక్కడి నుంచి బీజేపీ తరపున ప్రాతినిథ్యం వహించిన డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1999, 2014 ఎన్నికల్లో ముషీరాబాద్‌ నుంచి డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌ నుంచి ముఠా గోపాల్‌ ముషీరాబాద్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఐతే 2022లో లక్ష్మణ్‌ను ఓబీసీ కోటాలో యూపీ నుంచి రాజ్యసభకు పంపింది బీజేపీ అధిష్ఠానం. ప్రస్తుతం ఆయన పదవీకాలం 2028 వరకు ఉంది. లక్ష్మణ్‌ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవచ్చని..ఎంపీగానే కొనసాగుతారన్న ప్రచారం జరుగుతోంది

First Published:  10 Sep 2023 11:17 AM GMT
Next Story