Telugu Global
Telangana

బీజేపీకి రాజీనామా చేసిన‌ దాసోజు శ్రవణ్.... టీఆరెస్ లో చేరతారని సమాచారం

బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తాం అని చెప్పిన బీజేపీ మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని ఆయన ఆరోపించారు. శ్రవణ్ టీఆరెస్ లో చేరబోతున్నట్టు సమాచారం.

బీజేపీకి రాజీనామా చేసిన‌ దాసోజు శ్రవణ్.... టీఆరెస్ లో చేరతారని సమాచారం
X

దాసోజు శ్రవణ్ భారతీయ జనతా పార్టీకి ఈ రోజు రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన బీజేపీలో చేరిన నాటి నుంచే అసంత్రుప్తిగా ఉన్నారు.

ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి రాసిన రాజీనామా లేఖలో

''తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం అనిశ్చితమైన దశ దిశా లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి.

ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తాం అని చెప్పిన మీరు, మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలాలే, పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లుగా కొనసాగిస్తున్న వైఖరి నాలాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండ‌దని తేటతెల్లమైంది.

అనేక ఆశలతో ఆశయాలతో నేను బీజేపీలో చేరినప్పటికీ దశాదిశాలేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మ రాజకీయాలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలో అర్థమైంది.

ప్రజాహితమైన పథకాలతో, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం తద్వారా మునుగోడు ఎన్నికలలో గెలుపు సాధించాలనుకుంటున్న మీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.'' అని పేర్కొన్నారు.

బీజేపీకి రాజీనామా చేసిన శ్రవణ్ టీఆరెస్ చేరబోతున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంకాలం టీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు.


First Published:  21 Oct 2022 7:28 AM GMT
Next Story