Telugu Global
Telangana

దాశరధి మాటే తెలంగాణ ఉద్యమానికి బాట చూపింది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

దాశరధి విగ్రహాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నామని.. జూలై 22న ఆయన జయంతి సందర్భంగా పనులు ప్రారంభిస్తామన్నారు.

దాశరధి మాటే తెలంగాణ ఉద్యమానికి బాట చూపింది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
X

నిజాం కాలంలో దాశరధి, వట్టికోట అళ్వారు స్వామిని ఇందూరు జైలులో బంధించారు. ఆ జైలు గోడల మీద దాశరధి 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని బొగ్గుతో రాశారు. ఆ మాటే యావత్తు తెలంగాణ ఉద్యమానికి బాట చూపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అటు వంటి చరిత్ర కలిగిన ఖిలా జైలు గోడను తన ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.40 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నామని కవిత చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన హరిద రచయితల సంఘం రాష్ట్ర మహాసభలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

దాశరధి విగ్రహాన్ని కూడా ఖిలాలో ఏర్పాటు చేస్తున్నామని.. జూలై 22న ఆయన జయంతి సందర్భంగా పనులు ప్రారంభిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఖిల్లా జైలు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని కవిత చెప్పారు. కొత్త తరానికి ఆ జైలు ప్రాముఖ్యత, దాశరధి గొప్పతనం తెలియజెప్పేందుకు తప్పకుండా పనికి వస్తుందని అన్నారు. రచయితలు సమాజ హితం కోసం కలం విదిల్చడమే కాకుండా, జూలు కూడా విదిల్చాలని కవిత పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పని చేసే సాహిత్యం రావాలని ఆమె ఆకాంక్షించారు. సున్నితత్వాన్ని, మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కవిత స్పష్టం చేశారు.

నిజామాబాద్ జిల్లాలో అద్భుతమైన సాహితీవేత్తలు ఉన్నారు. తరతరాల నుంచి వస్తున్న ఈ అద్భుతమైన సాహిత్య సంపదను కొనసాగించాలని ఆమె కోరారు. హరిద రచయితల సంఘం కార్యకలాపాలు కొనసాగించడానికి ఒక నిర్ధిష్టమైన వేదికను ఏర్పాటు చేస్తామని కవిత హామీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా హరిద కార్యకలాపాలు విస్తరించాలని కవిత కోరారు.

ఇప్పటి పిల్లల్లో బుక్ కల్చర్ తగ్గిపోయిందిన కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తక సంస్కృతిలోకి పిల్లలను తీసుకొని రాకపోతే.. భవిష్యత్‌లో ఎంతో ఘోరమైన ఘటనలు చూడాల్సి వస్తుందన్నారు. పుస్తకాన్ని చదివితే జీవితాన్ని మనది మనం అనుభవిస్తున్నట్లు ఉంటుందని కవిత చెప్పారు. చాలా తక్కువ సినిమాలే ఆలోపించజేసేలా ఉంటాయి.. బుక్స్ మాత్రం ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తాయని కవిత అన్నారు.

ప్రపంచీకరణ జరిగిన తర్వాత మన ఫోన్లకు రకరకాల జాఢ్యాలు వచ్చాయి. అవి పెరిగి పెచ్చరిల్లుతున్నాయని.. వాటికి తప్పకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ హితం కోసం పని చేసే సాహిత్యం రావల్సి ఉందని కవిత అభిప్రాయపడ్డారు. హిందీ భాషలో కూడా రాసే కవులను కూడగట్టి దేశంలో వస్తున్న నిర్లిప్తత ఏంటి? సంస్కృతి ఏంటి? అనే అంశాలపై రాయడాన్ని ప్రోత్సహిస్తున్నామని కవిత వెల్లడించారు.

First Published:  31 May 2023 10:37 AM GMT
Next Story