Telugu Global
Telangana

చరిత్రలో తొలి సారి హైకోర్టు అడ్వొకేట్ల సంఘానికి దళిత అధ్యక్షుడు

ఇన్ని ఏళ్లుగా ప్రతీ ఏడాదీ టీహెచ్‌సీఏఏకి ఎన్నికలు జరుగుతూ వస్తున్నా.. ఏనాడూ ఒక దళితుడు అధ్యక్షుడు కాలేదని హైకోర్టు అడ్వొకేట్లు చెబుతున్నారు.

చరిత్రలో తొలి సారి హైకోర్టు అడ్వొకేట్ల సంఘానికి దళిత అధ్యక్షుడు
X

తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్(టీహెచ్‌సీఏఏ) అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. 2023-24 ఏడాదికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. 1950లో హైదరాబాద్‌లో హైకోర్టు ఏర్పడిన దగ్గర నుంచి ఈ అసోసియేషన్‌కు అధ్యక్షుడు అయిన తొలి దళితుడిగా ఆయన రికార్డులకు ఎక్కారు. నిజాం నవాబులు హైదరాబాద్ స్టేట్‌లో హైకోర్టును ఏర్పాటు చేశారు. అయితే 1956 నవంబర్ 5న ఇది ఉమ్మడి ఏపీ హైకోర్టుగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దీన్ని హైకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్ ఆఫ్ హైదరాబాద్‌గా మార్చారు. ఇక 2018 డిసెంబర్ 26న తెలంగాణ హైకోర్టుగా మారింది.

ఇన్ని ఏళ్లుగా ప్రతీ ఏడాదీ టీహెచ్‌సీఏఏకి ఎన్నికలు జరుగుతూ వస్తున్నా.. ఏనాడూ ఒక దళితుడు అధ్యక్షుడు కాలేదని హైకోర్టు అడ్వొకేట్లు చెబుతున్నారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో నాగేశ్వరరావుకు 2,981 ఓట్లకు గాను 1,120 ఓట్లు పొందారు. గత 29 ఏళ్లుగా నాగేశ్వరరావు పలు హోదాల్లో పని చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్టాండింగ్ కౌన్సెల్‌గా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. అలాగే తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు గవర్నమెంట్ ప్లీడర్‌గా వ్యవహరించారు.

ఇక టీహెచ్‌సీఏఏ ఉపాధ్యక్షుడిగా చెంగల్వ కల్యాణ్ రావు, కార్యదర్శులుగా ప్రదీప్ రెడ్డి, పులి దేవేందర్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా వంగల పూర్ణశ్రీ ఎన్నికయ్యారు. ఇక నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో జి. కిరణ్ కుమార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డి. రవీందర్, జనరల్ సెక్రటరీగా మాధవరెడ్డి ఎన్నికయ్యారు.

Next Story