Telugu Global
Telangana

దళితులంటే బీజేపీకి అంత చులకనా..?

దళితులంటే బీజేపీకి ఎందుకంత చులకన భావం అని నిలదీస్తున్నారు దళిత సంఘాల నేతలు. తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో బయటకు వెళ్లినందుకు రఘునందన్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

దళితులంటే బీజేపీకి అంత చులకనా..?
X

పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి కాంగ్రెస్ కూడా మద్దతిచ్చింది. అయితే అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సభ నుంచి వెళ్లిపోయారు. కనీసం తీర్మానానికి మద్దతు కూడా తెలపలేదు. ఈ విషయంలో బీజేపీ తీరుని నిరశిస్తూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి వ్యతిరేకంగా దుబ్బాకలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు దళిత సంఘాల నాయకులు.

దుబ్బాకలో ఆందోళన..

బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఆల్రడీ ఒకరు జైలులో ఉన్నారు, మరొకరు స్పీకర్‌పై నోరు పారేసుకుని సస్పెండ్ అయ్యారు. మిగిలిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రఘునందన్ రావు కనీసం తీర్మానం సమయంలో మద్దతు తెలపకపోగా సభ నుంచి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అంబేద్కర్ పై బీజేపీ నేతలకు ఉన్న గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు ఇతర పార్టీల నేతలు. దళిత సంఘాలు కూడా ఇదే విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దుబ్బాకలో ఆందోళనలు చేపట్టాయి. ఎమ్మెల్యే రఘునందన్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు దళితులు.

ఎన్నికల్లో బుద్ధి చెబుతాం..

దళితులంటే బీజేపీకి ఎందుకంత చులకన భావం అని నిలదీస్తున్నారు దళిత సంఘాల నేతలు. తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో బయటకు వెళ్లినందుకు రఘునందన్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెడుతున్నట్టుగా బీజేపీ ప్రకటించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే దళితుల ఐక్యత చూపిస్తామని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.

First Published:  14 Sep 2022 11:41 AM GMT
Next Story