Telugu Global
Telangana

అతిపెద్ద సైబర్ స్కామ్ గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీస్

ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్టు సైబరాబాద్ పోలీసులు నిర్థారించారు. దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్‌ నేరగాళ్లు, పౌరుల వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారన్నారు.

అతిపెద్ద సైబర్ స్కామ్ గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీస్
X

దేశంలోనే అతిపెద్ద సైబర్ స్కామ్ ఇది.

మొత్తం 16కోట్లమంది దేశ పౌరుల డేటా అమ్మకానికి పెట్టారు.

ఆర్మీకి చెందిన 2.5 లక్షలమంది వివరాలు చోరీ చేశారు.

ఈ అంతర్ రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కోట్లాదిమంది పర్సనల్ డేటా దుర్వినియోగం అయ్యే క్రమంలో అడ్డుకట్ట వేశారు.

తమకు తెలియకుండానే తమ డేటా చోరీకి గురైందని, తమ వివరాలతో లోన్లకు అప్లై చేస్తున్నారని, క్రెడిట్ కార్డ్ లకు దరఖాస్తులు చేస్తున్నారని, వాటికి సంబంధించిన వెరిఫికేషన్ కాల్స్ తమకి వస్తున్నాయంటూ.. ఇటీవల హైదరాబాద్‌ లో కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో సైబరాద్ పోలీసులు ఫోకస్‌ పెట్టారు. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేశామని చెప్పారు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర. ఢిల్లీ, నాగపూర్‌, ముంబైకి చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడి డేటా స్కామ్ కి పాల్పడ్డారని వివరించారు.

ఆర్మీ ఉద్యోగుల్నీ వదిలిపెట్టలేదు.

ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్టు సైబరాబాద్ పోలీసులు నిర్థారించారు. దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్‌ నేరగాళ్లు, పౌరుల వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారన్నారు.

ఎలా చోరీ చేస్తారంటే..?

ఇటీవల పలు తమిళ సినిమాల్లో చూపించినట్టుగా లోన్ల వ్యవహారంతోనే మన వ్యక్తిగత డేటా లీకవుతోంది. బ్యాంకుల్లో లేదా, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో లోన్లకోసం దరఖాస్తు చేసే సమయంలో పాన్, ఆధార్, ఇతర వివరాలన్నీ వారికి ఇస్తుంటాం. లోన్ రిజెక్ట్ అయితే ఆయా కాపీలు మనం తిరిగి తీసుకోం. కొన్ని సందర్భాల్లో సాఫ్ట్ కాపీలను యథేచ్ఛగా ఎవరికి కావాలంటే వారికి పంపించేస్తాం. వాటి గురించి తిరిగి ఆలోచించం. ఇలా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే డేటా చోరీకి గురవుతుందని చెబుతున్నారు పోలీసులు. బీమా, లోన్లకు అప్లై చేసిన 4 లక్షల మంది డేటా చోరీకి గురైనట్టు గుర్తించారు.

సోషల్ మీడియా అకౌంట్లు కూడా..

దేశంలో కోట్లాదిగా సోషల్‌ మీడియా ఐడీలు, పాస్‌ వర్డ్‌ లు కూడా లీకయ్యాయి. ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైంది. ఈ ముఠా సభ్యులు ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌ కార్డులు, లోన్‌ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నారు. డేటా చోరీ గ్యాంగ్‌ లకు ఆయా కంపెనీల్లోని కొందరు ఉద్యోగులు కూడా సాయం చేస్తున్నారు. ఇలా సేకరించిన వ్యక్తిగత డేటాను వారు తిరిగి వైట్ కాలర్ మోసగాళ్లకు అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలు ఇలా పోలీసులకు చిక్కాయి. 16కోట్లమంది డేటా కలిగిన ఈ ముఠా అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

First Published:  23 March 2023 10:29 AM GMT
Next Story