Telugu Global
Telangana

ఆత్మస్తుతి తప్ప అభివృద్ధి లేదు.. కేంద్రంపై సీడబ్ల్యూసీ ధ్వజం

ద్రవ్యోల్బణం పేద, మధ్యతరగతి ప్రజలను పోషకాహారానికి దూరం చేసిందన్నారు. జనగణన చేపట్టకపోవడం వల్ల 14కోట్లమంది ప్రజలు ఆహార భద్రతకు దూరమయ్యారని, ఉపాధిహామీ కూడా అందరికీ లభించట్లేదన్నారు.

ఆత్మస్తుతి తప్ప అభివృద్ధి లేదు.. కేంద్రంపై సీడబ్ల్యూసీ ధ్వజం
X

దేశంలో అభివృద్ధి కుంటుపడినా కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ డబ్బా ఘనంగా మోగిస్తోందంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నేతలు మండిపడ్డారు. మోదీ హయాంలో అన్నిరంగాల్లోనూ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అంతర్గతంగా సమస్యలున్నాయని, సరిహద్దు సమస్యలనూ కేంద్రం పరిష్కరించలేకపోయిందని, ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థితిలో ఉందని.. ఒకటేంటి, అన్నిరంగాల్లోనూ కేంద్రం విఫలమైందని దుయ్యబట్టారు. మిగిలిన రోజులయినా ఆత్మస్తుతి మానుకుని పాలనపై దృష్టిపెట్టాలని కోరారు.


సోనియా, రాహుల్, ఖర్గే సహా.. వర్కింగ్ కమిటీ సభ్యులు, ఇతర నాయకులు హైదరాబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ లో పాల్గొన్నారు. మణిపూర్ అల్లర్లు, నూహ్ హింస ను నివారించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. ఆ ప్రభావం రాజస్థాన్, యూపీ, ఢిల్లీపై కూడా పడుతోందని హెచ్చరించారు.

కాంగ్రెస్ హయాంలో సిలిండర్ ధర పెరిగితే రోడ్డెక్కి నిరసన చేసిన మంత్రులు, ఇతర నాయకులు అసలిప్పుడు నోరుమెదపడంలేదని, దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని గుర్తు చేశారు. ద్రవ్యోల్బణం పేద, మధ్యతరగతి ప్రజలను పోషకాహారానికి దూరం చేసిందన్నారు. జనగణన చేపట్టకపోవడం వల్ల 14కోట్లమంది ప్రజలు ఆహార భద్రతకు దూరమయ్యారని, ఉపాధిహామీ కూడా అందరికీ లభించట్లేదన్నారు. వెంటనే జనగణన చేపట్టాలన్నారు.

స్నేహితులకు దోచిపెట్టడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, వారి ప్రయోజనాలకోసం ఏకంగా కొత్త చట్టాలు సైతం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అదే సమయంలో భారీ వర్షాలతో కొన్నిరాష్ట్రాలు విలయాన్ని చూస్తుంటే సహాయం చేయడానికి కేంద్రానికి చేతులు రావట్లేదన్నారు. జీ-20 గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని చెప్పారు. రొటేషన్ పద్ధతిలో ఆ సమావేశాల నిర్వహణ భారత్ కు లభించిందని, దీనికోసం కేంద్రం రూ.4వేల కోట్లు ఖర్చుచేసిందని అన్నారు. ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు రాబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు కూడా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయి. సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది.

First Published:  17 Sep 2023 1:12 AM GMT
Next Story