Telugu Global
Telangana

కేసీఆర్‌తో తమ్మినేని భేటీ.. ఏం చర్చించబోతున్నారు?

కమ్యూనిస్టులు ఎలాగూ బీజేపీకి మద్దతు ఇవ్వరు గనుక.. కాంగ్రెస్ వైపు వెళ్లకుండా నిలువరించాలని కేసీఆర్ స్కెచ్ వేశారు. అందుకనుగుణంగా ఇప్పటికే సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించగా.. తాజాగా సీపీఎం కూడా మద్దతు తెలిపింది.

కేసీఆర్‌తో తమ్మినేని భేటీ.. ఏం చర్చించబోతున్నారు?
X

మునుగోడుకు ఉప ఎన్నిక రానుండటంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ ఉప ఎన్నికను బీజేపీ కోరి తెచ్చుకున్న విషయం తెలిసిందే. బై ఎలక్షన్ లో గెలిచి కేసీఆర్ కు సవాల్ విసరాలని బీజేపీ చూస్తోంది. మరోవైపు ఈ ఉప ఎన్నిక‌ను ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే నల్లగొండ జిల్లాలో వామపక్షాలు బలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. అక్కడ కమ్యూనిస్టులకు సొంత కార్యకర్తల బలంతో పాటు సానుభూతిపరుల ఓటు బ్యాంకు కూడా గణనీయంగా ఉంటుంది. దీంతో ఎలాగైనా వారిని తమవైపున‌కు తిప్పుకోవాలని కేసీఆర్ వ్యూహాలు రచించారు.

కమ్యూనిస్టులు ఎలాగూ బీజేపీకి మద్దతు ఇవ్వరు గనుక.. కాంగ్రెస్ వైపు వెళ్లకుండా నిలువరించాలని కేసీఆర్ స్కెచ్ వేశారు. అందుకనుగుణంగా ఇప్పటికే సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించగా.. తాజాగా సీపీఎం కూడా మద్దతు తెలిపింది. నిన్న సాయంత్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికతోపాటు పలు కీలక అంశాలపై వీరు చర్చలు జరపబోతున్నట్టు సమాచారం. ఇటీవల సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ప్రత్యేకంగా నజర్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తోనూ ఆయన భేటీ అయ్యారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకూడదని కమ్యూనిస్టులు బలంగా కోరుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కూడా బీజేపీ వ్యతిరేక శక్తులకు వారు మద్దతు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో కేసీఆర్.. తమ్మినేని భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది.

త్వరలో జరగబోయే ఉప ఎన్నికతో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ పొత్తుపెట్టుకోబోతుంద‌న్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా ఇరువురు నేతలు చర్చలు జరపబోతున్నట్టు సమాచారం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వామపక్ష పార్టీలకు దాదాపు 20, 000 వరకు ఓటు బ్యాంకు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఓట్లు ఎంతో కీలకంగా మారనున్నాయి. కమ్యూనిస్టులు బీజేపీకి ఓటేయరు క‌నుక ఈ ఓట్లపై గులాబీ బాస్ కన్నేశారు. ఈ పొత్తు సక్సెస్ అయితే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి గడ్డు పరిస్థితి ఎదురుకాక తప్పదు.

First Published:  2 Sep 2022 7:10 AM GMT
Next Story