Telugu Global
Telangana

పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయం.. తమ్మినేని వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటి?

బీజేపీ, కాంగ్రెస్‌లను ఎదుర్కోవడానికి వచ్చే ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో జత కట్టాలని సీఎం కేసీఆర్ కూడా భావిస్తున్నారు. అయితే సీపీఐ, సీపీఎంకు ఎన్ని సీట్లు కేటాయించాలో, ఎక్కడ ఇవ్వాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయం.. తమ్మినేని వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటి?
X

'ఇంకో ఏడాదిలో ఎన్నికలు వస్తాయి. పాలేరులో మనమే పోటీ చేస్తాం. అక్కడ మన గెలుపు ఖాయం' అంటూ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మునుగోడు ఉపఎన్నికకు ముందు సీపీఐ, సీపీఎం పార్టీలు టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చాయి. ముందుగా సీపీఐతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. ఆ తర్వాత సీపీఎం కూడా మద్దతు ప్రకటించింది. అంతే కాకుండా మునుగోడులో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ తరపున చాడా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు ప్రచారం కూడా చేశారు. ఈ కలయిక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉంటుందని వామపక్ష పార్టీలు ప్రకటించాయి.

బీజేపీ, కాంగ్రెస్‌లను ఎదుర్కోవడానికి వచ్చే ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో జత కట్టాలని సీఎం కేసీఆర్ కూడా భావిస్తున్నారు. అయితే సీపీఐ, సీపీఎంకు ఎన్ని సీట్లు కేటాయించాలో, ఎక్కడ ఇవ్వాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎర్రజెండా పార్టీలు తాము బలంగా ఉన్న నియోజకవర్గాలను కోరుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఈ రెండు పార్టీలకు బలం ఉన్నది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలంతో పాటు ఓటు బ్యాంకు కూడా ఉన్నది. దీంతో కొన్ని నియోజకవర్గాలపై ఇప్పటికే ఆ రెండు పార్టీలు ఫోకస్ చేశాయి.

ఇవ్వాళ ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంలో సీపీఎం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకుంటే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్క సీటు కూడా పోకుండా టీఆర్ఎస్ గెలుచుకుంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా నిలబడితే వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండే అవకాశం ఉన్నది. తెలుగుదేశం హయాంలో సీపీఐ, సీపీఎంకు ఒకటి రెండు సీట్లే ఇచ్చినట్లు కాకుండా.. ఈ సారి ఎక్కువ సీట్లే వచ్చే అవకాశం ఉన్నది. టీఆర్ఎస్ వాళ్లే చెప్తున్న లెక్కల ప్రకారం పాలేరులో మన ఎర్రజెండా ఎగరడం ఖాయం' అని వీరభద్రం చెప్పుకొచ్చారు.

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు కంచు కోటగా ఉన్నది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో తుమ్మల రాజకీయాల్లో సైలెంట్ అయ్యారు. కానీ, ఇటీవల తుమ్మల తన అనుచరులతో వాజేడులో ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. జీవితాంతం కేసీఆర్‌తోనే ఉంటానని చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తుమ్మల టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని అభిమానులు అనుకుంటున్నారు.

తమ్మినేని వీరభద్రం తాజా వ్యాఖ్యలతో తుమ్మల నాగేశ్వరావు, కందాల ఉపేందర్ రెడ్డి అభిమానులు ఆందోళనలో పడిపోయారు. పాలేరు సీటును సీపీఎంకు కేటాయిస్తే.. టీఆర్ఎస్ వెంట నడుస్తున్న తమ నాయకుల పరిస్థితి ఏంటని వాపోతున్నారు. కాగా, ఎన్నికలు ఇంకా ఏడాది ఉండగా.. సీపీఎం కార్యదర్శి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. పొత్తులు కుదరక ముందే పాలేరు సీటు తమదే అనే ధోరణిలో మాట్లాడటం మంచిది కాదని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరి తమ్మినేని వ్యాఖ్యలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి.

First Published:  13 Nov 2022 11:48 AM GMT
Next Story