Telugu Global
Telangana

రామోజీ భూదాహం ఇంకా తీరలేదా..?

వైఎస్ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఫిల్మ్ సిటీ సమీపంలోని ప్రభుత్వ భూముల్లో 576 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే అక్కడ పేదలెవరూ ఇళ్లు నిర్మించకుండా రామోజీరావు అడ్డుకుంటున్నారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు.

రామోజీ భూదాహం ఇంకా తీరలేదా..?
X

ప్రతి మనిషి ఏదో ఒక చోట ఇక చాలు అనుకోవాలి.. వయసు మీద పడే కొద్దీ దురాశకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కానీ ఈనాడు అధినేత రామోజీరావుకు మాత్రం ఇంకా భూదాహం తీరడం లేదని ఆరోపిస్తున్నారు ఫిల్మ్‌ సిటీ సమీపంలోని ప్రజలు. రామోజీరావు తీరుకు వ్యతిరేకంగా సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఫిల్మ్ సిటీ వర‌కు పాదయాత్ర కూడా నిర్వహించారు.

వైఎస్ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఫిల్మ్ సిటీ సమీపంలోని ప్రభుత్వ భూముల్లో 576 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే అక్కడ పేదలెవరూ ఇళ్లు నిర్మించకుండా రామోజీరావు అడ్డుకుంటున్నారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి తాము ఇళ్లు నిర్మించుకోకుండా అడ్డుకుంటున్న రామోజీరావు.. ఇప్పుడు ఏకంగా ఆ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇళ్ల స్థలాలను రద్దు చేసి ఆ భూమిని టూరిజం అభివృద్ధి కోసం తమకు అప్పగించాల్సిందిగా అధికారులపై రామోజీరావు ఒత్తిడి తెస్తున్నారని, ఇప్పటికే అందుకోసం దరఖాస్తు కూడా చేస్తున్నారని స్థలాల లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేల ఎకరాలను ఫిల్మ్ సిటీ కింద ఉంచుకున్న రామోజీరావు.. ఇప్పుడు పేదల ఇళ్ల స్థలాలను కూడా వదలడం లేదని మండిపడుతున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన చోటే మరో 162 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని.. దాన్ని కూడా మరింత మంది పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. కేటాయించిన ఇళ్ల స్థలాల భూమిని రామోజీ కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. సీపీఎం ఆధ్వర్యంలో నాగల్‌పల్లి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఉన్న భూములు వరకు పాదయాత్ర చేశారు.

భూముల కోసం రామోజీరావు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలని లేనిపక్షంలో ఈనెల 28న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ల‌బ్ధిదారులు ప్రకటించారు. ఇప్పటికే ఫిల్మ్‌ సిటీలో అనేక చెరువులు, కుంటలను, ప్రభుత్వ రహదారులను కూడా రామోజీరావు ఆక్రయించారని, కాబట్టి కేసు నమోదు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.

First Published:  24 Nov 2022 5:12 AM GMT
Next Story