Telugu Global
Telangana

టీఆర్ఎస్‌కి సీపీఎం మద్దతు.. మునుగోడు విజయం లాంఛనమేనా..?

2018లో వామపక్షాలు పోటీ చేయలేదు. అయినా వారి ఓటుబ్యాంక్ అలానే ఉంది. ఇప్పుడు వామపక్షాలు టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వడంతో గులాబీ దళం విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి.

టీఆర్ఎస్‌కి సీపీఎం మద్దతు.. మునుగోడు విజయం లాంఛనమేనా..?
X

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కి మద్దతిస్తామని సీపీఐ ఇదివరకే ప్రకటించగా, ఇప్పుడు సీపీఎం అదే బాటలో వెళ్తానంది. టీఆర్ఎస్ కి మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్‌ కి మద్దతిస్తున్నట్టు తెలిపారు. మునుగోడు ఎన్నిక విషయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ రెండు పార్టీల నుంచి మద్దతు కావాలని విజ్ఞప్తులు వచ్చాయని, రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు టీఆర్‌ఎస్‌ కు మద్దతు ఇస్తున్నామని అన్నారాయన. నల్లగొండ జిల్లాలో వామపక్షాలకు మంచిపట్టు ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు రెండూ పోటీ చేశాయి. రెండు పార్టీలకు కలిపి 30వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 2018లో వామపక్షాలు పోటీ చేయలేదు. అయినా వారి ఓటుబ్యాంక్ అలానే ఉంది. ఇప్పుడు వామపక్షాలు టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వడంతో గులాబీ దళం విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి, బీజేపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ ఈ సీటుని కైవసం చేసుకుని అసెంబ్లీ ఎన్నికలను సగర్వంగా ఎదుర్కోడానికి సై అంటోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత టీఆర్ఎస్ మునుగోడుకి వ్యూహాన్ని పూర్తిగా మార్చింది. అభ్యర్థిని ఎంపిక చేసే దగ్గర్నుంచి, పొత్తుల వరకు అన్ని విషయాలను సీఎం కేసీఆర్ ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తున్నారు. వామపక్షాల పూర్తి మద్దతుతో మునుగోడులో టీఆర్ఎస్ విజయావకాశాలను మరింత మెరుగుపరిచారు కేసీఆర్.

నాలుగేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి కేవలం అభ్యర్థి ఒక్కరే బీజేపీలో చేరారు. కాంగ్రెస్ కేడర్ మాత్రం చెల్లాచెదరవుతోంది. ఇప్పటికే చాలామంది టీఆర్ఎస్ కండువాలు కప్పేసుకున్నారు. మిగిలినవారిని కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలని చూస్తోంది. దీంతో బీజేపీకి ఇబ్బందులు తప్పేలా లేవు. అమిత్ షా, నడ్డా పర్యటనలతో కూడా పెద్దగా ప్రయోజనం లేదని తేలిపోయింది. ఇప్పుడు సీపీఐతోపాటు, సీపీఎం కూడా జై టీఆర్ఎస్ అనే సరికి మునుగోడు ఉప ఎన్నికకు ముందే బీజేపీలో ఓటమి భయం మరింత పెరిగింది.

First Published:  1 Sep 2022 7:59 AM GMT
Next Story