Telugu Global
Telangana

కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఫుల్ కోటింగ్..

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిందని, కానీ ఆయన బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారాడని దెప్పిపొడిచారు కూనంనేని. రాజగోపాల్ రెడ్డిలాగా తామేమీ పార్టీలు మారి పారిపోలేదన్నారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఫుల్ కోటింగ్..
X

కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఫుల్ కోటింగ్ ఇచ్చేశారు సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కమ్యూనిస్టులపై రాజగోపాల్ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని, ఆయనలాగా తామేమీ పార్టీలు వదిలి పారిపోలేదని కౌంటర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ధర్మయుద్ధం చేస్తున్నానని చెబుతున్నారని, కోమటిరెడ్డి బ్రదర్స్ నోటి నుంచి ఆ పదం వస్తే, ధర్మమే సిగ్గుతో తలదించుకుంటుందని ధ్వజమెత్తారు. క‌మ్యూనిస్టులు అమ్ముడుపోయారంటూ రాజగోపాల్ రెడ్డి అనడం సరికాదని, ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. అదుపు తప్పితే.. నాలుక చీరేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడని, అతనికి ఆత్మ లేదని, గౌరవం కూడా లేదని అన్నారు.

బీజేపీకి ఆయన స్టార్ క్యాంపెయినర్..

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిందని, కానీ ఆయన బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారాడని దెప్పిపొడిచారు. తెలంగాణలో మోదీ, అమిత్ షాల ఆటలు సాగవని, మోదీని దేశ ప్రజలు తరిమికొట్టే రోజులు వచ్చాయని మండిపడ్డారు. చండూరు మండ‌లం బంగారిగ‌డ్డలో టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడు అడ్డ, కమ్యూనిస్టుల గడ్డ అని చెప్పారు. టీఆర్ఎస్‌తో కమ్యూనిస్టులు కలసిన తర్వాత తమకు ఎదురులేదని అన్నారు.

నీ పేగులు తీసి మెడలో వేసుకుంటాడు జాగ్రత్త..

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కూడా సాంబశివరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దొంగ ప్రమాణాలు చేస్తే, యాదాద్రి నరసింహుడు పేగులు తీసి మెడలో వేసుకుంటాడని అన్నారు. స్వాములు, మ‌ఠాధిప‌తులకు ఫాం హౌసుల్లో ఏం ప‌ని అని ప్రశ్నించారు. 8 రాష్ట్ర ప్రభుత్వాల‌ను బీజేపీ కూల్చేసిందని, ఇప్పుడు తెలంగాణపై కన్నేసింద‌ని విమర్శించారు. తెలంగాణ గడ్డపై బీజేపీ ఆటలు సాగనివ్వబోమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్, క‌మ్యూనిస్ట్ పార్టీలు క‌లిసి ప‌ని చేస్తాయని స్పష్టం చేశారు కూనంనేని.

First Published:  30 Oct 2022 1:08 PM GMT
Next Story