Telugu Global
Telangana

అది విమోచనం కాదు, విలీనమే.. గవర్నర్ లిమిట్స్‌లో ఉండాలి

సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గవర్నర్ తమిళి సైపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉండాలన్నారు. గవర్నర్ తనకు మించిన పనులు చేస్తున్నారని విమర్శించారు.

అది విమోచనం కాదు, విలీనమే.. గవర్నర్ లిమిట్స్‌లో ఉండాలి
X

సెప్టెంబర్ 17 అనేది విమోచన దినం కాదని, విలీన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. అది విలీనమో, విమోచనమో గవర్నర్‌కి ఎందుకని ప్రశ్నించారు. గవర్నర్ తనకు మించిన పనులు చేస్తున్నారని, ఆమె ఎంతమేరకు ఉండాలో అంతవరకే ఉండాలని సూచించారు. గవర్నర్ వ్యవస్థ ప్రజలకు అస్సలు పనికి రాదని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని అన్నారు.

సాయుధ పోరాటమే కీలకం..

1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటం మొదలైందని గుర్తు చేశారు కూనంనేని సాంబశివరావు. స్వాతంత్య్రం వచ్చినా సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే కమ్యూనిస్ట్‌లు సాయుధ పోరాటం మొదలుపెట్టారని, 3 వేల గ్రామాలు విముక్తి చేశారని చెప్పారు. సాయుధ పోరాటం జరిగింది భూ స్వాములకు వ్యతిరేకంగానే అని గుర్తు చేశారు. ఆ పోరాటం వల్లే నిజాం లొంగిపోయి పటేల్‌తో మ్యాచ్ ఫిక్స్ చేసుకొన్నారని అన్నారు. ఫ్యూడల్ సమాజంపై భాదితులు సాయుధ పోరాటంతో తిరగబడ్డారని, ఫ్యూడల్ సిస్టమ్ లీడర్ నిజాం లొంగిపోయారని తెలిపారు.

ముస్లిం పాలకుల నుండి హిందువులకు విముక్తి లభించింది అనడం దుర్మార్గమని అన్నారు కూనంనేని. నిజాం రాజు వేరు, ముస్లిం ప్రజలు వేరని పేర్కొన్నారాయన. సాయుధ పోరాటం చేసింది 90 శాతం మంది హిందువులపైనే అని వివరించారు. ప్రజలను విడగొట్టాలనుకునేవారు దేశ భక్తులు కాదని మండిపడ్డారు. అసలు బీజేపీకీ సెప్టెంబర్ 17తో సంబంధమే లేదని అన్నారు కూనంనేని. ఖాసిం రజ్వీని పాకిస్తాన్‌కి పారిపోయేందుకు ఎందుకు అవకాశం ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

విమోచన అనేదే నిజమైతే.. అప్పటి దాకా ప్రజల్ని ఇబ్బంది పెట్టినవాళ్ళని జైల్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు కూనంనేని. బీజేపీ వాళ్లు దేశభక్తులు కాదని అన్నారు. విలీనం, విమోచనం అంటూ ప్రజల్ని గందరగోళ పరుస్తున్నారని చెప్పారు. సెప్టెంబర్ 11నుంచి తెలంగాణలో సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. సెప్టెంబరు 17న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున విలీన దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విలీన దినోత్సవం, మరోవైపు కేంద్రం ఆధ్వర్యంలో విమోచన కార్యక్రమం, ఎంఐఎం శాంతి ర్యాలీ.. ఇప్పుడు కొత్తగా సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవం.. ఇలా ఈ ఏడాది సెప్టెంబర్ 17 తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.

First Published:  10 Sep 2022 12:02 PM GMT
Next Story