Telugu Global
Telangana

నిశ్చితార్థం తర్వాత జంపింగ్ లు రాజకీయాల్లో కుదరదు

కాంగ్రెస్ కాదంటే సీపీఐ చేయగలిగింది కూడా ఏమీ లేదు. సొంతగా పోటీ చేసి ఓట్లు చీల్చడం మినహా ఆ పార్టీ ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే ట్వీట్లతో సరిపెడుతున్నాయి ఎర్రకండువాలు.

నిశ్చితార్థం తర్వాత జంపింగ్ లు రాజకీయాల్లో కుదరదు
X

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ నాయకులకే కాదు, తమని నమ్ముకుని ఉన్న మిత్రపక్షాలకు కూడా సున్నం చుడుతోంది. ఇప్పటికే తెలంగాణ జనసమితికి టికెట్లు ఇవ్వకుండా మద్దతు కోరింది. కోదండరాం కూడా.. ఆ మద్దతుతోనే సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిపెడతానన్నారు. ఇక పొత్తు ఉంది అంటూ వామపక్షాలకు ఇన్నాళ్లూ సర్దిచెబుతూ వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. చివరకు వారికి కూడా షాకిచ్చేలా ఉంది. ఈ దశలో సీపీఐ నారాయణ కాంగ్రెస్ వ్యవహార శైలిపై సెటైర్లు పేల్చారు. నిశ్చితార్థం తర్వాత వేరేవాళ్లు నచ్చారంటూ లగేస్కు వెళ్లడం నిజ జీవితంలో అక్కడక్కడ చూస్తుంటాం కానీ రాజకీయాల్లో కుదరదు అని తేల్చి చెప్పారు.


వాస్తవానికి వామపక్షాలకు తెలంగాణలో సొంతగా పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవు. అందుకే ఇండియా కూటమి పేరు చెప్పి తెలంగాణలో కూడా కాంగ్రెస్ తో కలసి వెళ్లాలనుకున్నాయి. కాంగ్రెస్ నేతలు కూడా వారిని అలాగే ఊరిస్తూ వచ్చారు. కొత్తగూడెం, చెన్నూరు టికెట్లు కాంగ్రెస్ కి ఇస్తామని మాటిచ్చారు కూడా. కానీ ఇటీవల పరిణామాలు వేగంగా మారాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వివేక్ వెంకట స్వామి కుటుంబానికి చెన్నూరు టికెట్ ఖరారు చేసే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. వివేక్ కొడుకు వంశీ.. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. అంటే అక్కడ సీపీఐకి హ్యాండిచ్చినట్టే. దీంతో ఇప్పుడు ఆ పార్టీ స్వరం పెంచుతోంది.

కాంగ్రెస్ పార్టీని సీపీఐ ఇంకా అభ్యర్థించే స్థాయిలోనే ఉంది. నారాయణ ట్వీట్ లో ఎక్కడా డిమాండ్లు లేవు. నిశ్చితార్థం తర్వాత అందమైన అమ్మాయి, లేదా అబ్బాయి దొరికితే వారిని లగేస్కుని పోవడం రాజకీయాల్లో కూడా జరిగితే ఎలా అంటూ కాంగ్రెస్ ని మర్యాదపూర్వకంగా ప్రశ్నించారు నారాయణ. కాంగ్రెస్ కాదంటే సీపీఐ చేయగలిగింది కూడా ఏమీ లేదు. సొంతగా పోటీ చేసి ఓట్లు చీల్చడం మినహా ఆ పార్టీ ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే ట్వీట్లతో సరిపెడుతున్నాయి ఎర్రకండువాలు. దీన్ని అలుసుగా తీసుకుని కాంగ్రెస్ కూడా పబ్బం గడుపుకుంటోంది.

First Published:  2 Nov 2023 6:46 AM GMT
Next Story