Telugu Global
Telangana

ఖమ్మంలో సీపీఐ మద్దతు కాంగ్రెస్ కా..? పువ్వాడకా..?

తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వ్యక్తి పువ్వాడ అజయ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. తండ్రికి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ అని మండిపడ్డారు.

ఖమ్మంలో సీపీఐ మద్దతు కాంగ్రెస్ కా..? పువ్వాడకా..?
X

పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ సీనియర్ నేత. వామపక్ష నాయకుడిగా తన రాజకీయం ప్రారంభించి, ఆ పార్టీతోనే తన ప్రస్థానం ముగించారు, ప్రస్తుతం వయోభారంతో యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. ఆయన తనయుడు పువ్వాడ అజయ్ కుమార్.. వైసీపీ టు కాంగ్రెస్, కాంగ్రెస్ టు బీఆర్ఎస్..ఇలా తన రూట్లో వెళ్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. మంత్రి హోదాలో ఉన్న పువ్వాడ, ఖమ్మం నుంచి మరోసారి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. ఈ దశలో ఆయనకు సీపీఐ మద్దతిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పువ్వాడ నాగేశ్వరరావుపై ఉన్న అభిమానంతో ఆయన తనయుడు పువ్వాడ అజయ్ కి సీపీఐ శ్రేణులు మద్దతిస్తాయని అంటున్నారు. అయితే సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. తమ పార్టీ కేడర్ పొత్తు ధర్మం పాటిస్తుందని, పువ్వాడకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని అంటున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

మంత్రి పువ్వాడపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఖమ్మంలో సీపీఐ, కాంగ్రెస్ కు సపోర్ట్ చేయదు అనే అపోహ ఉందని, అజయ్ కు మద్దతిస్తుందనే తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అలాంటి ఆలోచనలు ఉంటే ఇవాళ్టితో వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. ఒకవేళ అజయ్ కి సీపీఐ నుంచి ఎవరైనా లోపాయికారీగా సపోర్ట్ చేసినా.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తులసి వనంలో..

తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వ్యక్తి పువ్వాడ అజయ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. తండ్రికి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి సీపీఐ మద్దతు ఇవ్వబోదు అన్నారు. ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం పువ్వాడ నాగేశ్వర రావు ఎంతో కృషి చేశారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీట్లలో ఖమ్మం కూడా ఉందంటున్నారు నారాయణ.

First Published:  24 Nov 2023 6:19 AM GMT
Next Story