Telugu Global
Telangana

ఆ పని చేస్తే టీఆర్ఎస్ నేతలపై కేసులు మాఫీ..

ఏపీలో వైసీపీ లాగా బీజేపీకి సలాం కొడితే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు సీపీఐ నారాయణ. ఏపీలో వైసీపీ గెలిస్తే, బీజేపీ గెలిచినట్టేనని చెప్పారు.

ఆ పని చేస్తే టీఆర్ఎస్ నేతలపై కేసులు మాఫీ..
X

నయానో భయానో ప్రాంతీయ పార్టీలను తమవైపు తిప్పుకోడానికి కేంద్రం నీఛ రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాబట్టే ఆ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఒకవేళ కేసీఆర్ గనక మోదీకి జై కొడితే రాత్రికి రాత్రే కేసులన్నీ మాఫీ అయిపోతాయని చెప్పారు. తెలంగాణ ఆత్మాభిమానం తలవంచకపోవడం వల్లే కేంద్రంలోని బీజేపీ సర్కారు టీఆర్ఎస్ నేతల్ని కేసుల పేరుతో ఇబ్బంది పెడుతోందన్నారు నారాయణ.

శారద, నారద ఏమయ్యాయి..?

తృణమూల్ కాంగ్రెస్‌ లో శారద, నారద కేసుల్లో ఉన్నవాళ్లు, ఆ తర్వాత బీజేపీలో చేరారని, వెంటనే ఆ కేసులనుంచి వారిని తప్పించారని గుర్తు చేశారు నారాయణ. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, వ్యక్తులపై.. కేంద్రం ఏకపక్ష దాడులు జరుపుతోందని మండిపడ్డారు. ఏపీలో వైసీపీ లాగా బీజేపీకి సలాం కొడితే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. ఏపీలో వైసీపీ గెలిస్తే, బీజేపీ గెలిచినట్టేనని చెప్పారు నారాయణ. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువగా, వైసీపీ నుంచే ఆ పార్టీకి మద్దతు దక్కుతోందన్నారు. టీడీపీని బలహీనపర్చడం కోసం పవన్ కళ్యాణ్‌ ను బీజేపీ తమవైపు లాగుతోందన్నారు. మోదీకి మద్దతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా ఏపీలో అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు.

అక్కడ కూడా పువ్వు గుర్తేనా.. ?

జి-20కి భారత్ నాయకత్వం వహించడాన్ని సీసీఐ స్వాగతిస్తోందని చెప్పిన నారాయణ, లోగోలో పువ్వు గుర్తు ఎందుకని నిలదీశారు. ఇది బీజేపీ ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమని, ఆ పువ్వు లోగోని వెంటనే తొలగించాలని కోరారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదించకుండా.. జి-20లో మహిళా సాధికారతపై ఏం చర్చిస్తారని ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు నారాయణ. మహిళా బిల్లు ఆమోదానికి సీపీఐ పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

First Published:  1 Dec 2022 10:59 AM GMT
Next Story