Telugu Global
Telangana

బిగ్‌బాస్ ఓ 'బూతుల స్వర్గం'.. ఘాటు వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ

బిగ్‌బాస్ తొలి సీజన్ నుంచి సీపీఐ నారాయణ ఆ కార్యక్రమాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఐదో సీజన్ సమయంలో అయితే అదొక బ్రోతల్ హౌస్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆరో సీజన్ ప్రారంభమైన రెండో రోజే నారాయణ విమర్శల దాడికి దిగారు.

బిగ్‌బాస్ ఓ బూతుల స్వర్గం.. ఘాటు వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ
X

స్టార్ మా ఛాన‌ల్‌లో ప్రసారం అయ్యే బిగ్‌బాస్ రియాల్టీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తరుచూ విమర్శలు చేస్తుంటారు. తాజాగా బిగ్‌బాస్ 6వ సీజన్ ప్రారంభమైంది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ సీజన్‌ను మరింతగా అలరించే విధంగా రూపొందించారు. కాగా, ఈ కార్యక్రమంపై అనేక ప్రజా, మహిళా సంఘాలు ఇప్పటికే విమర్శలు చేశాయి. టీవీల్లో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం వల్ల పిల్లలు, యువత పెడదారిన పట్టే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు.

బిగ్‌బాస్ తొలి సీజన్ నుంచి సీపీఐ నారాయణ ఆ కార్యక్రమాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఐదో సీజన్ సమయంలో అయితే అదొక బ్రోతల్ హౌస్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆరో సీజన్ ప్రారంభమైన రెండో రోజే నారాయణ విమర్శల దాడికి దిగారు. బిగ్‌బాస్ ఓ బూతుల స్వర్గం అని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.

'సిగ్గు, యెగ్గు లేని జంతువులు ఏమైనా చేయగలవు. తాజాగా కొన్ని వింత జంతువులు, భార్యభర్తలు కానోళ్లు, అన్నా చెల్లెలు కానోళ్లు, ముక్కుముఖం తెలియని అందగాళ్లు.. అక్కినేని నాగార్జున కనుసన్నల్లో 100 రోజుల పాటు బూతుల స్వర్గంలో అమూల్యమైన కాలాన్ని వృథా చేసే మహత్తరమైన బిగ్‌బాస్ కార్యక్రమం వస్తోంది' అని ఆ కార్యక్రమం గురించి చెప్పారు. యువత తమ శక్తి, యుక్తులు ఉన్నంత కాలం సమాజం కోసం పని చేయాలని.. సామాజిక న్యాయం కోసం లేదా సంపద సృష్టించడానికి పని చేయాల్సిన 100 అమూల్యమైన రోజులను ఇలా వృథా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

బూతుల స్వర్గంనుంచి ఏం ఉత్పత్తి చేస్తారు అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి సిగ్గులేని కార్యక్రమం వస్తుంటే ప్రజలు కళ్లు అప్పగించి చూస్తూ జాతీయ సంపదను వృథా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రేక్షకులే ఈ కార్యక్రమం గురించి ప్రసారకర్తలను నిలదీయాలని అన్నారు. భర్తలు భార్యలను వదిలేసి.. భార్యలు భర్తలను వదిలేసి జీవించండని సందేహం ఇస్తారా? కాసులకు కక్కుర్తి పడే సమాజం ఉన్నంత కాలం ఇలాంటి పాపాలకు ఆదరణ ఉన్నంత కాలం, ద్రౌపది వస్త్రాపహరణం వర్థిల్లుతూనే ఉంటుందనే బాధను దిగుమింగుదామా? శ్రీశ్రీ చెప్పినట్లు పదండి ముందుకు పదండి తోసుకు అని ఉరుకుదామా అని నారాయణ ప్రశ్నించారు.

గతంలో బిగ్‌బాస్‌ను నారాయణ బ్రోతల్ హౌస్‌గా అభివర్ణించడంపై అప్పటి కంటెస్టెంట్స్ తమన్నా సింహాద్రి, బాబుగోగినేని తీవ్ర అభ్యంతరం తెలిపారు. అలా అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలని సింహాద్రి తమన్నా కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ షో వల్ల తమ లాంటి వాళ్లకు గుర్తింపుతో పాటు ఉపాధి కలుగుతుందని అన్నారు. ఎవరికైనా నచ్చకపోతే ఛానల్ మార్చుకోమని కూడా హితవు పలికారు. బాబు గోగినేని కూడా బిగ్‌బాస్ హౌస్‌కు మద్దతుగా మాట్లాడారు.

కానీ, నారాయణ ఏ మాత్రం తగ్గలేదు. బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా సంస్కృతిక దోపిదీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది చాలా అనైతికమైన‌ షో అని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఈ షోకు అనుమతిస్తున్నాయో అని అనుమానం వ్యక్తం చేశారు.

First Published:  5 Sep 2022 11:16 AM GMT
Next Story