Telugu Global
Telangana

రేవంత్‌తో కలిసి నడిచిన సీపీఐ నాయకులు.. పొత్తు కాదంటున్న జిల్లా అధ్యక్షుడు

అశ్వాపురం దాటిన తర్వాత రేవంత్ రెడ్డితో కలిసి దాదాపు 25 మంది సీపీఐ నాయకులు ఆయనతో కలిసి కాసేపు నడిచారు.

రేవంత్‌తో కలిసి నడిచిన సీపీఐ నాయకులు.. పొత్తు కాదంటున్న జిల్లా అధ్యక్షుడు
X

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 'యాత్ర' పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఆదివాసీలు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగుతున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఇతర నాయకులు కూడా పాదయాత్ర కోసం జనసమీకరణ బాగానే చేస్తున్నారు. దీంతో ఆయన ఉత్సాహంగా రోజుకు సగటున 15 కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో రేవంత్ పాదయాత్ర సాగింది.

అశ్వాపురం దాటిన తర్వాత రేవంత్ రెడ్డితో కలిసి దాదాపు 25 మంది సీపీఐ నాయకులు ఆయనతో కలిసి కాసేపు నడిచారు. సీపీఐ పార్టీ అనుబంధ కార్మిక, కుల సంఘాలకు చెందిన నేతలు ఆయనను కలిసి కాసేపు మాట్లాడారు. అనంతరం యాత్రలో ఆయనతో పాటు కలిసి నడిచారు. గత ఏడాది మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. స్వయంగా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని తెలిపారు. సీపీఎం పార్టీ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం ఒకడుగు ముందుకేసీ.. బీఆర్ఎస్ నుంచి ఏయే సీట్లు కోరతామో కూడా చెప్పారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి సీపీఐ నాయకులు నడవటం చర్చనీయాంశంగా మారింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డిని కలిసి.. రైతు, కరెంట్, పోడు వ్యవసాయానికి సంబంధించిన సమస్యలను డిస్కస్ చేశారు. దీనిపై ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి పి. ప్రసాద్ వివరణ ఇచ్చారు. అశ్వాపురంలోని ఎస్బీఐ బ్రాంచ్ వద్ద సీపీఐ నాయకులు ధర్నా చేశారని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీకి మద్దతుగా నిలవడానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో రేవంత్ పాదయాత్ర అటు వైపు రావడంతోనే ఆయనకు సంఘీభావంగా కొంత దూరం నడిచారని.. దీనికి పొత్తుతో ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కాగా, రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇవ్వాళ భద్రాచలం పట్టణానికి చేరుకోనున్నది.

First Published:  14 Feb 2023 6:39 AM GMT
Next Story