Telugu Global
Telangana

కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ.. కానీ, ఒక్క కండీషన్

బెల్లంపల్లి, కొత్తగూడెం హుస్నాబాద్‌, మునుగోడు స్థానాలు ఆయన కోరారు. ఇందులో ఏవైనా మూడు స్థానాలు కేటాయిస్తే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు సిద్ధమని చెప్పినట్టు సమాచారం.

కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ.. కానీ, ఒక్క కండీషన్
X

బీఆర్ఎస్‌తో పొత్తు ఆశలు అడియాశలు కావడంతో.. కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ నేతలతో చర్చలు జరిపారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. తాము పోటీ చేసే స్థానాలను ఆయన కాంగ్రెస్‌ దృష్టికి తీసుకెళ్లారు. బెల్లంపల్లి, కొత్తగూడెం హుస్నాబాద్‌, మునుగోడు స్థానాలు ఆయన కోరారు. ఇందులో ఏవైనా మూడు స్థానాలు కేటాయిస్తే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు సిద్ధమని చెప్పినట్టు సమాచారం.

మరోవైపు.. సీపీఎం రాష్ట్ర కార్యవర్గం ఆదివారం సమావేశమైంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా సమావేశం కొనసాగింది. బీఆర్ఎస్‌తో పొత్తు కుదరకపోవడంతో.. సీపీఐతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే సీపీఎం నిర్ణయించింది. పొత్తులు, సీట్ల సర్దుబాటు సహా వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా లెఫ్ట్‌ పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పొత్తు ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే సీఎం కేసీఆర్‌ అనూహ్యంగా 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. కమ్యూనిస్టు పార్టీల ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో కేసీఆర్ పొత్తు ధర్మం పాటించలేదని లెఫ్ట్ పార్టీల నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో లెఫ్ట్‌ పార్టీల ముందు రెండే ఆప్షన్స్‌ ఉన్నాయి. కాంగ్రెస్‌తో కలిసి పొత్తులో వెళ్లడమా.. లేదా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయడమా.. సీట్ల సర్దుబాటులో చర్చలు కొలిక్కి వస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేసే అవకాశం ఉంది.

*

First Published:  27 Aug 2023 12:20 PM GMT
Next Story