Telugu Global
Telangana

షర్మిల ప్రసంగాన్ని ఒక్క నిమిషం కూడా వినలేక.. వీడియో బంద్ చేయమన్న న్యాయమూర్తి!

మహబూబాబాద్ పోలీసులు తన పాదయాత్రకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

షర్మిల ప్రసంగాన్ని ఒక్క నిమిషం కూడా వినలేక.. వీడియో బంద్ చేయమన్న న్యాయమూర్తి!
X

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మహబూబాబాద్ జిల్లాలో పర్యటన చేస్తూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిపై తీవ్ర పదజాలంతో దూషించారు. హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయడం లేదని చెబుతూ.. వారిని రాయకూడని భాషలో తిట్టారు. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులే కాకుండా ప్రజల నుంచి కూడా తీవ్రమైన ప్రతిస్పందన వచ్చింది. మహబూబాబాద్‌లో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు కూడా నమోదు అయ్యింది. పాదయాత్ర సమయంలో దూషణలకు దిగవద్దని, తీవ్రమైన పదజాలం వాడవద్దనే షరతులతోనే గతంలో కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ, ఆమె కోర్టు షరతులను కూడా తుంగలో తొక్కి ఇష్టానుసారం వ్యవహరించారు.

మహబూబాబాద్ పోలీసులు తన పాదయాత్రకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం దీనిపై జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో కోర్టు ఇచ్చిన అనుమతులను మహబూబాబాద్ ఎస్పీ రద్దు చేశారని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. కాగా, హోం శాఖ తరపున వాదనలు వినిపంచిన లాయర్ రూపేందర్.. షర్మిల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. వ్యక్తిగత ఆరోపణలు చేయడం వల్లే అనుమతులు రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

మహబూబాబాద్ పాదయాత్రలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా పరిశీలించాలని జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డిని కోరారు. రోజూ టీవీల్లో చూస్తున్నాం కదా.. ఇంకేమి చూడాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే.. టీవీలో కట్ చేసిన ఫుటేజీ కూడా ఉందని చెప్పి.. ఆ సదరు వీడియోను జడ్జికి చూపించారు. అయితే ఆ వీడియో ప్లే చేసిన నిమిషం లోపే.. నేను ఈ వీడియోను చూడలేను, బంద్ చేయడండని జడ్జి చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని షరతులు పెట్టే పాదయాత్రకు పర్మిషన్ ఇస్తే.. ఎందుకు ఉల్లంఘించాని జడ్జి ప్రశ్నించారు.

పాదయాత్రకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని.. కేవలం మహబూబాబాద్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు సమాధానం మాత్రమే షర్మిల ఇచ్చారని న్యాయవాది కోర్టుకు చెప్పారు. హైకోర్టు షరతులకు మేము కట్టుబడి ఉన్నామని లాయర్ వివరించారు. కాగా, ఆ ఎమ్మెల్యే ఇప్పుడు కోర్టులో లేరు. అసలు అనుమతులు ఇచ్చింది ఆ ఎమ్మెల్యేను బేస్ చేసుకొని కాదు కదా.. కేవలం పాదయాత్రకు సంబంధించి కొన్ని షరతులు హైకోర్టు విధించినప్పుడు .. వాటికి కట్టుబడి ఉండాలి కదా అని ప్రశ్నించింది.

హైకోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటామని అఫిడవిట్ దాఖలు చేస్తేనే.. తదుపరి విషయాన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తి చెప్పారు. అఫిడవిట్ దాఖలు చేయడానికి మూడు రోజులు సమయం ఇస్తున్నామని చెప్పి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

First Published:  1 March 2023 6:32 AM GMT
Next Story