Telugu Global
Telangana

చీకోటికి పొలిటికల్ అపాయం.. హై సెక్యూరిటీ..

క్యాసినో నిర్వాహకుడి కేసులో కీలక అప్ డేట్ ఇది. తనకు పొలిటికల్ థ్రెట్ ఉందని, పోలీస్ సెక్యూరిటీ పెంచాలని కోర్టులో పిటిషన్ వేసిన చీకోటి అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ని ఆదేశించింది.

చీకోటికి పొలిటికల్ అపాయం.. హై సెక్యూరిటీ..
X

గోరంట్ల మాధవ్ వీడియో బయటకు రాకపోయి ఉంటే.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా కొనసాగేది. కానీ ఏపీలో మాధవ్ వీడియో బయటకు రావడం, తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మీడియా చీకోటిని కాస్త పక్కనపెట్టింది. అయితే ఈ క్యాసినో నిర్వాహకుడి కేసులో కీలక అప్ డేట్ ఇది. తనకు పొలిటికల్ థ్రెట్ ఉందని, పోలీస్ సెక్యూరిటీ పెంచాలని కోర్టులో పిటిషన్ వేసిన చీకోటి అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ని ఆదేశించింది. ఈడీ కేసు విచారణ ముగిసే వరకు ఆయనకు సెక్యూరిటీ కల్పించే అంశంపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.

ఆ నేతలు ఎవరు..? వారి ప్రమేయం ఎంత..?

విదేశాలకు వెళ్లడం, క్యాసినోలు ఆడటం.. కొంతమంది రాజకీయ నాయకులకు, సినీ తారలకు అలవాటు. ఇవన్నీ గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుంటాయి. కానీ ఇక్కడ క్యాసినో నిర్వాహకుడు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కావడం, ఇటీవల ప్రత్యేక విమానాల్లో వారిని నేపాల్ తీసుకెళ్లి క్యాసినో ఏర్పాటు చేయడంతో ఈ వ్యవహారం కాస్తా బాగా హైలెట్ అయింది. అందులోనూ హవాలా మార్గంలో డబ్బు చేతులు మారిందన్న ఆరోపణపై ఈడీ దృష్టి పెట్టింది. దీంతో నేతలు, సినీ తారల్లో కూడా భయం మొదలైంది. వారి పేర్లను, వారి రహస్యాలను చీకోటి ప్రవీణ్ ఈడీ ముందు బయటపెట్టారో లేదో తెలియదు కానీ, ఎవరికి నచ్చినట్టు వారు కథనాలు వండివారుస్తున్నారు. ఆయనకు ఆ పార్టీ ముద్ర వేయాలని, ఈ పార్టీ వారు, ఈ పార్టీ కండువా కప్పేయాలని ఆ పార్టీ వారు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ తనకు ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్రయించారు.

ఇప్పటికే చీకోటి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి రాజకీయ బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పలువురు నాయకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సహజంగానే ప్రచారంలో ఉన్న నాయకుల్లో ఆందోళన మొదలైంది. వారి వల్ల చీకోటికి హాని ఉందా లేదా అనే విషయాన్ని చెప్పలేం, అదే సమయంలో చీకోటిపై ఎవరైనా దాడి చేసి, వేరేవారిపైకి నెట్టే ప్రయత్నాన్నీ కొట్టి పారేయలేం. ఈ దశలో చీకోటి పోలీస్ రక్షణ కోరారు. వారు పట్టించుకోవడంలేదంటూ హైకోర్ట్ లో పిటిషన్ వేసి అభ్యర్థించారు. మొత్తమ్మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో చీకోటి పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. పెద్దమనుషుల తలరాతలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయని అంటున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ లాగా ఇది కూడా నీరుగారిపోతుందా, లేక వ్యవహారం ఈడీ చేతుల్లో ఉంది కాబట్టి, రాజకీయాలకు వాడుకుంటారా.. అనేది వేచి చూడాలి.

First Published:  12 Aug 2022 3:14 AM GMT
Next Story