Telugu Global
Telangana

కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి..

ఇదే కేసుకు సంబంధించి 2023 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు విచారణ జరిపారు. ఇప్పుడు తీహార్ జైలులో ఉన్న కవితను మరోసారి ప్రత్యేకంగా విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు.

కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి..
X

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ముప్పేట దాడి మొదలైంది. ఆమెను ప్రస్తుతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ అనంతరం కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. కవితను విచారించేందుకు అనుమతి కావాలన్న సీబీఐకి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ అధికారులు తీహార్ జైలులోనే ఆమెను విచారించబోతున్నారు.

బెయిల్ సంగతేంటి..?

ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను మార్చి 15న అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో తమ కస్టడీలోనే విచారణ జరిపారు. అనంతరం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొడుకు పరీక్షలకు సన్నద్ధమవుతుండటంతో.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టులో పిటిషన్ వేశారు. గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పుని సోమవారానికి రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు సీబీఐ ఎంట్రీ ఇవ్వడంతో బెయిల్ వ్యవహారం సందిగ్ధంలో పడింది. ఒకవేళ బెయిల్ మంజూరు చేసినా, సీబీఐ విచారణకోసం మళ్లీ కవితను కస్టడీలోకి తీసుకుంటారా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది.

ఇదే కేసుకు సంబంధించి 2023 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు విచారణ జరిపారు. ఇప్పుడు తీహార్ జైలులో ఉన్న కవితను మరోసారి ప్రత్యేకంగా విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. గతంలో ఆమె నమోదు చేసిన వాంగ్మూలం, అప్రూవర్‌గా మారినవారు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కవితను ప్రశ్నించిన అనంతరం సీబీఐ మరో చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

First Published:  5 April 2024 1:37 PM GMT
Next Story