Telugu Global
Telangana

మెడికల్ సీట్ల పేరుతో మోసం.. మోస్ట్‌ వాంటెడ్‌ బ్యానర్లతో ప్రదర్శన

మెడికల్ సీటుకు 50 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేశారు. ఇంజనీరింగ్‌ సీటుకు రూ.10 నుంచి 16 లక్షల వరకు వసూలు చేశారు. ఈ దందా కోసం తెలంగాణ సీఎంవో పేరును కూడా వీరు వాడినట్టు పోలీసులు గుర్తించారు.

మెడికల్ సీట్ల పేరుతో మోసం.. మోస్ట్‌ వాంటెడ్‌ బ్యానర్లతో ప్రదర్శన
X

ఇంజనీరింగ్‌, మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ కోట్లాది రూపాయలు వసూలు చేసిన మోసం వెలుగుచూసింది. హైదరాబాద్‌ కాచిగూడలో శ్రీధర్ రెడ్డి, అతడి భార్య సంధ్యారెడ్డి ఈ మోసానికి పాల్పడ్డారు.

మెడికల్ సీటుకు 50 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేశారు. ఇంజనీరింగ్‌ సీటుకు రూ.10 నుంచి 16 లక్షల వరకు వసూలు చేశారు. ఈ దందా కోసం తెలంగాణ సీఎంవో పేరును కూడా వీరు వాడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీట్ల పేరుతో వీరు మోసానికి పాల్పడ్డారు.

గ్రోవెల్ ఎడ్యుకేషనల్‌ కేరియర్‌ సర్వీసెస్‌ పేరుతో కాచిగూడలో శ్రీధర్ రెడ్డి, అతడి భార్య సంధ్యారెడ్డి కలిసి కార్యాలయాన్ని నడుపారు. రెండున్నరేళ్లుగా వీరు ఇలా డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వీరిపై ఇప్పటికే పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల దొరక్కుండా శ్రీధర్ రెడ్డి తిరుగుతున్నారు. ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయల వరకు వీరు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

బ్రోకర్లను నియమించుకుని మరీ ఇలా తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. సీబీఐటీలో సీటు ఇప్పిస్తానని ఎక్కువ మంది వద్ద డబ్బులు వసూలు చేశారు. తొలుత డబ్బులు తిరిగి ఇస్తామని శ్రీధర్ రెడ్డి నమ్మించారని .. కొద్ది రోజులుగా అసలు అందుబాటులో లేకుండాపోయారని చెబుతున్నారు.

బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి శ్రీధర్‌ రెడ్డిపై ఫిర్యాదులు చేసే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతడిపై చాలా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయిన విషయాన్ని పోలీసులు తెలియజేశారు. మూడు నెలల నుంచి శ్రీధర్‌ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారు. సిమ్‌లు మార్చి ఫోన్‌లో కూడా దొరకడం లేదని బాధితులు చెబుతున్నారు. దాదాపు 150 మంది బాధితులున్నారని.. కొందరు బయటకు రావడం లేదని చెబుతున్నారు. చివరకు బాధితులంతా ఒక గుంపుగా మారి శ్రీధర్‌ రెడ్డి కార్యాలయం ముందు.. మోస్ట్‌ వాంటెడ్ అంటూ బ్యానర్లతో ప్రదర్శన చేశారు.

First Published:  29 Jan 2023 12:45 PM GMT
Next Story