Telugu Global
Telangana

అదను చూసి మోసం.. పత్తి రైతుని చిత్తు చేసిన కేంద్రం

విత్తన ధరలు పెంచుతూ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తోంది కేంద్రం. బీటీ పత్తి విత్తనాల ధరల నియంత్రణ కేంద్రం చేతుల్లోనే ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ ప్రతి ఏటా ధరలను కొత్తగా ప్రకటిస్తుంది. ఈ ఏడాది కూడా ధరలు పెంచింది.

అదను చూసి మోసం.. పత్తి రైతుని చిత్తు చేసిన కేంద్రం
X

పత్తి వాణిజ్య పంట. లాభాలొస్తే కొన్నాళ్ల వరకు రైతులకు కరువుండదు, నష్టాలొస్తే ఆత్మహత్యలే దిక్కు. కానీ రైతన్న ఏనాడూ నిరాశపడడు, అధైర్యపడడు. కేంద్ర ప్రభుత్వం మాత్రం పత్తిరైతుని పీల్చి పిప్పిచేసేందుకు కంకణం కట్టుకుంది. విత్తన ధరలు పెంచుతూ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తోంది. బీటీ పత్తి విత్తనాల ధరల నియంత్రణ కేంద్రం చేతుల్లోనే ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ ప్రతి ఏటా ధరలను కొత్తగా ప్రకటిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి BT పత్తి BG-1 రకం ధరను ప్యాకెట్ కి 635 రూపాయలుగా నిర్ణయించారు. BG-2 ప్యాకెట్ ధర 853 రూపాయలుగా నిర్ణయించారు. రైతులు ఎక్కువగా BG-2 విత్తనాలను వాడుతుంటారు. గతేడాది ప్యాకెట్ ధర 810 రూపాయలు కాగా, ఈ ఏడాది దాన్ని 853 రూపాయలకు చేర్చింది కేంద్రం.

కరీంనగర్ జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా పత్తి సాగు జరుగుతుంది. ప్రస్తుతం 80 వేల ఎకరాల వరకు సాగు మొదలైంది. సరిగ్గా విత్తనాలు వేసే సమయానికి కేంద్రం విత్తన ప్యాకెట్ రేట్లు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ కూలీల ధరలు కూడా పెరగడంతో రైతులు ఈసారి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఒక్క కరీంనగర్ జిల్లాలో ఈసారి రైతులపై పత్తి విత్తనాల అదనపు భారం అక్షరాలా 30 లక్షల రూపాయలు. ఈ పాపం కేంద్రానిదేనంటూ విమర్శలు మొదలయ్యాయి.

పెట్రోల్, డీజిల్, గ్యాస్.. ఇలా అన్నిటిపై భారం మోపుతూ కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తోంది. అదే సమయంలో విత్తనాల రేట్లు పెంచి రైతులపై కూడా భారం మోపింది. పత్తి రైతులు ఎక్కువగా BG-2 రగం BT విత్తనాలను వాడతారు. వాటి రేటుని ప్రభుత్వం పెంచింది. ఎకరాకు రెండు ప్యాకెట్లు వాడతారు రైతులు. ఒకసారి విత్తనాలు మొలకెత్తకపోతే.. రెండోసారి కూడా కొనాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

నకిలీ మాయ..

ఒరిజినల్ పత్తివిత్తనాల రేట్లు పెరగడంతో.. నకిలీ విత్తనాలు మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి. వీటికి లేబుల్ ఉండదు, ధర తక్కువ. ల్యాబ్ నంబర్, విత్తన రకం, కంపెనీ పేర్లు లేకపోవడంతో.. ఒకవేళ మొలకెత్తకపోయినా రైతులు పరిహారం పొందే అవకాశం ఉండదు. ఒకరకంగా విత్తనాల రేట్లు పెంచి, రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయే ప్రమాదాన్ని కూడా కేంద్రమే కొని తెచ్చిందని చెప్పాలి.

పురుగుమందులు పిరం..

విత్తనాల ధరలే కాదు, పురుగుమందుల ధరలు కూడా కేంద్రం నియంత్రణలోనే ఉంటాయి. పీఎం కిసాన్ వంటి కార్యక్రమాలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే కేంద్రం పురుగుల మందులపై 18శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. అంటే ఆ చేత్తో ఇచ్చి, ఈ చేత్తో అంతకంటే ఎక్కువగానే గుంజుతోందని అర్థం.

ఇంత సాహసం చేసి రైతులు పత్తిని పండించినా.. గిట్టుబాటు ధరలు లేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. రేటు కోసం నిల్వచేసుకోవడం కూడా సాహసమనే చెప్పాలి. విత్తనాల రేట్లు, పురుగుల మందుల రేట్లు ఎడా పెడా పెంచేస్తున్న కేంద్రం రైతుల కన్నీళ్లకు ప్రధాన కారణం అవుతోంది. కేంద్రం చర్యలతో రైతులు ఇన్ని కష్టాలపాలవుతున్నా.. రాష్ట్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం పట్టీ పట్టనట్టు ఉన్నారు.

First Published:  7 April 2023 11:13 AM GMT
Next Story