Telugu Global
Telangana

కరప్ట్ కాంగ్రెస్.. కరక్ట్ బీఆర్ఎస్.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా, ఉచిత కరెంటు, వికలాంగుల పెన్షన్, దళిత బంధు, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని పేర్కొననారు.

కరప్ట్ కాంగ్రెస్.. కరక్ట్ బీఆర్ఎస్.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు
X

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్న వేళ ఆ పార్టీ తీరును విమర్శిస్తూ హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్ల వద్ద పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కరప్ట్ కాంగ్రెస్.. కరక్ట్ బీఆర్ఎస్ అంటూ ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ పోస్టర్లలో పలు వివరాలు రాసుకొచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలను తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలతో పోలుస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా, ఉచిత కరెంటు, వికలాంగుల పెన్షన్, దళిత బంధు, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని పేర్కొననారు.

తెలంగాణలో దళితులకు ఆర్థిక సాయంగా రూ.10 లక్షలు ఇస్తుండగా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో ఇచ్చేది సున్నా అని పేర్కొన్నారు. ఇక దివ్యాంగుల పెన్షన్ ఛత్తీస్‌గఢ్‌లో రూ.500, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.1300, కర్ణాటకలో రూ.1100, రాజస్థాన్‌లో రూ.1250 ఇస్తుండగా తెలంగాణలో మాత్రం రూ.4,116 ఇస్తున్నట్లు పోస్టర్లలో పేర్కొన్నారు.

వృద్ధాప్య పెన్షన్ ఛత్తీస్‌గఢ్‌లో రూ.500, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.750- రూ.1250, కర్ణాటకలో రూ.1000, రాజస్థాన్‌లో రూ.100 నుంచి రూ.1250 ఇస్తుండగా తెలంగాణలో మాత్రం రూ.2016 ఇస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో రైతు బీమా పథకమే లేదని.. తెలంగాణలో ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో రైతు బంధ పేరుతో పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.10వేలు ఇస్తుండగా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అసలు అమలులోనే లేదని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ అసలు లేదు. ఇచ్చే కరెంట్ కూడా నిత్యం కోతలతో సతమతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.


First Published:  17 Sep 2023 5:07 AM GMT
Next Story