Telugu Global
Telangana

హైదరాబాద్ సైంటిస్టుల ఘనత.. 3డీ టెక్నాలజీతో కార్నియా ప్రింటింగ్

ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చెందిన బృందం, ఐఐటీ హైదరాబాద్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కలసి గత కొన్నాళ్లుగా కృత్రిమ కార్నియా సృష్టించడానికి పరిశోధనలు చేస్తున్నారు.

హైదరాబాద్ సైంటిస్టుల ఘనత.. 3డీ టెక్నాలజీతో కార్నియా ప్రింటింగ్
X

దేశం 75 ఏళ్ల స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ హైదరాబాద్ సైంటిస్టులు అద్భుతమైన బహుమతిని అందించారు. కంటి సమస్యతో చూపును కోల్పోయే వారికి శుభవార్త చెప్పారు. ఇండియాలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో కార్నియాను ప్రింట్ చేశారు. దీన్ని కుందేలుపై పరీక్ష జరపగా విజయవంతం అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చెందిన బృందం, ఐఐటీ హైదరాబాద్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కలసి గత కొన్నాళ్లుగా కృత్రిమ కార్నియా సృష్టించడానికి పరిశోధనలు చేస్తున్నారు. పేరుకు ఇది కృత్రిమ కార్నియా అయినా.. మనిషి కంటి నుంచి తీసుకున్న టిష్యూలతోనే దీన్ని రూపొందించారు. 3డీ ప్రింటింగ్ కోసం అవసరమయ్యే 'బయో ఇంక్'ను ఒక దాత కంటి నుంచి సేకరించారు. మన కంటిపై భాగంలో ఉండే కీలకమైన పొరనే కార్నియా అంటారు. పలు కారణాల వల్ల కార్నియా పాడవటంతో చాలా మంది చూపును కోల్పోతున్నారు. ఇందుకు కార్నియా రిప్లేస్‌మెంట్ సరైన చికిత్స. కానీ అవయవ దానంలాగా దీన్ని ఇతరుల నుంచి బతికి ఉండగా సేకరించలేరు. అందుకే ల్యాబ్‌లో దీన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కార్నియా టిష్యూను సేకరించి దాన్ని బయో ఇంక్‌లా ఉపయోగించారు. దాని సహాయంతో ఈ కార్నియాను ప్రింట్ చేశారు. ఇలా తయారు చేసిన కార్నియా నాచురల్‌గా ఉంటుందని.. ఎలాంటి సింథటిక్ కాంపొనెంట్స్ ఉపయోగించలేదని పరిశోధకులు చెప్తున్నారు. భవిష్యత్‌లో దాతల నుంచి కార్నియా టిష్యూను సేకించి ఇలా 3డీ ప్రింట్ చేసి అవసరమైన వారికి ఉపయోగించవచ్చని చెప్తున్నారు. ఒక హ్యూమన్ టిష్యూ నుంచి మూడు కార్నియాలు తయారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పరిశోధనకు భారీ ఖర్చు అయ్యింది. ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం లేకున్నా దాతల నుంచి సేకరించిన నిధులతో ఈ పరిశోధన విజయవంతం చేశారు.

ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ సయాన్ బసు, డాక్టర్ వివేక్ సింగ్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఇప్పటికిప్పుడు ఈ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన కార్నియాను మనుషుల్లో ఉపయోగించలేమని.. కానీ రాబోయే రోజుల్లో మరిన్ని పరిశోధనల అనంతరం తప్పకుండా ఉపయోగించే అవకాశం ఉందని వాళ్లు స్పష్టం చేశారు. కేవలం చూపు పోయిన వాళ్లకే కాకుండా.. యుద్ద రంగంలో సైనికులకు ఈ 3డీ కార్నియాను కంటిపై పెట్టడం ద్వారా వాళ్లకు ప్రమాదాలు జరిగిన సమయంలో చూపు కోల్పోకుండా కాపాడవచ్చని చెప్తున్నారు. ఈ పరిశోధన బృందంలో షిబు, దీక్ష ప్రసాద్, యశ్ పరేఖ్ సభ్యులుగా ఉన్నారు. క్లినికల్ ట్రయల్స్‌కు విజయవాడకు చెందిన శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ నిధులు అందించనున్నట్లు వాళ్లు తెలిపారు.

First Published:  15 Aug 2022 11:04 AM GMT
Next Story