Telugu Global
Telangana

కూల్ రూఫ్ పాలసీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది : మంత్రి కేటీఆర్

కొత్త ఉద్యోగాల సృష్టిలో కూడా తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

కూల్ రూఫ్ పాలసీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న కూల్ రూఫ్ పాలసీ దీర్ఘ కాలంలో అనేక ప్రయోజనాల ఇస్తుందని, భవిష్యత్ తరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కూల్ రూఫ్ విధానాన్ని మొదటిగా తమ ఇంటి పైనే అమలు చేసినట్లు తెలిపారు. భవన యజమానులు ఎండ వేడిని తగ్గించుకునేందుకు సహజ విధానాలు పాటించేలా తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023-29 రూపొందించారు. సోమవారం హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి, మాట్లాడారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా టీఎస్ బీపాస్‌తో భవన నిర్మాణ అనుమతులు అతి తక్కువ సమయంలోనే ఇస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్రంలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కూల్ రూఫ్ పాలసీని ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో 5 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. తప్పకుండా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులకు భవన యజమానులు సహకరించాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇండ్లన్నింటి పైన కూల్ రూఫ్ పాలసీ అమలు చేస్తామని స్పష్టం చేశారు.

2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 600 చదరపు గజాల కంటే ఎక్కువ స్థలంలో భవనాలు నిర్మిస్తే.. తప్పకుండా కూల్ రూఫ్ ఏర్పాటు చేయాలనే నిబంధన తెస్తామని అన్నారు. కూల్ రూఫ్ వల్ల చదరపు మీటరుకు కేవలం రూ.300 ఖర్చు అవుతుందని మంత్రి చెప్పారు. అయితే ఈ పెయింటింగ్ వేయడం వల్ల కరెంటు చార్జీలు ఆదా అవుతాయని మంత్రి వెల్లడించారు.

ఇప్పటికే కట్టిన భవనాలకు కూడా కూల్ రూఫ్ విధానం అమలు చేయవచ్చని అన్నారు. ఈ పాలసీ అమలులో భాగంగా కూల్ రూఫ్‌ల ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఇవ్వడమే కాకుండా, అనుసరించే వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు. విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలనేది సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. పాలసీలు చేయడం తేలికే.. కానీ వాటిని అమలు చేయడమే సవాలుతో కూడుకున్న పని అని మంత్రి చెప్పారు.

ఆఫీస్ స్పేస్‌కు హైదరాబాద్‌లో డిమాండ్:

దేశంలోనే అత్యధిక ఆఫీస్ స్పేస్ డిమాండ్ హైదరాబాద్‌లో ఉందని మంత్రి చెప్పారు. ఈ విషయంలో చాలా గర్వపడుతున్నామని ఆయన అన్నారు. 2022లో బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై కంటే ఎక్కువ డిమాండ్ మన హైదరాబాద్‌లో ఉందని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. కోవిడ్ తర్వాత అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అసలు ఆఫీసులు ఏర్పాటు చేయడానికి కూడా చాలా మంది వెనకడుగు వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, ఆ ఇబ్బందులు అన్నీ అధిగమించి హైదరాబాద్ నగరంలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరిగిందని మంత్రి చెప్పారు. కోవిడ్ తర్వాత తెలంగాణే ఆఫీస్ స్పేస్‌లో అగ్రగామిగా నిలిచిందన్నారు. కేవలం ఆఫీస్ స్పేస్ ఉపయోగంలోనే కాకుండా.. కొత్త ఉద్యోగాల సృష్టిలో కూడా తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.


First Published:  3 April 2023 8:43 AM GMT
Next Story