Telugu Global
Telangana

ఫోన్ పే కి పోటీగా మునుగోడులో కాంట్రాక్ట్ పే..

ఫోన్ పే తరహాలో "కాంట్రాక్ట్ పే" అంటూ రాజగోపాల్ రెడ్డి బొమ్మ వేసి మరీ ఆ లావాదేవీ సక్సెస్ అయినట్టు చూపించారు. "ట్రాన్సాక్షన్ ఐడీ: బీజేపీ 18వేల కోట్లు" అంటూ ప్రింట్ చేశారు.

ఫోన్ పే కి పోటీగా మునుగోడులో కాంట్రాక్ట్ పే..
X

18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు తీసుకుని, దానికి బదులుగా బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే ఈ విషయం జనాలకు బాగా నాటుకుపోయింది. ఇప్పుడు దీనిపై మరో వెరైటీ ప్రచారం కూడా జరుగుతోంది. చూడగానే జనం గుర్తుపట్టేలా పేటీఎం ట్రాన్సాక్షన్ జరిగిందంటూ మునుగోడులో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఫోన్ పే తరహాలో "కాంట్రాక్ట్ పే" అంటూ రాజగోపాల్ రెడ్డి బొమ్మ వేసి మరీ ఆ లావాదేవీ సక్సెస్ అయినట్టు చూపించారు. "ట్రాన్సాక్షన్ ఐడీ: బీజేపీ 18వేల కోట్లు" అంటూ ప్రింట్ చేశారు. రివార్డ్ పాయింట్స్ కూడా పెట్టారు. 500కోట్ల రూపాయల బోనస్ రివార్డ్ పాయింట్ల రూపంలో దక్కింది అంటూ వాల్ పోస్టర్ కింద ప్రింట్ చేశారు.

ఆకట్టుకుంటున్న పోస్టర్లు..

ఆమధ్య కర్నాటకలో పేటీఎం తరహాలో పేసీఎం అనే పోస్టర్లు బాగా ఫేమస్ అయ్యాయి. రాష్ట్రంలో ప్రతి పనికీ కమిషన్ ముట్టజెప్పాల్సి వస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫొటోతో పేసీఎం పోస్టర్లు వేశారు. 40 పర్సెంట్ యాక్సెప్టెడ్ హియర్ అంటూ వాటిపై ప్రింట్ చేశారు. కర్నాటకలో కాంట్రాక్టర్ల దగ్గర 40శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలే ఈ పోస్టర్లు వేశారంటూ కొన్నిచోట్ల కేసులు నమోదయ్యాయి. ఆ పోస్టర్లతో బొమ్మై బాగా చికాకుపడ్డారు. ఇప్పుడు మునుగోడులో కూడా ఇలాంటి పోస్టర్లే దర్శనమిస్తున్నాయి.

ఇప్పటికే 18వేల కోట్ల రూపాయల వ్యవహారం రాజగోపాల్ రెడ్డిని చికాకు పెడుతోంది. పైగా పార్టీలో చేరే ముందు ఆయనకు బీజేపీ నేత వివేక్ కంపెనీ నుంచి 25 కోట్ల రూపాయలు బదిలీ అయిన వ్యవహారం కూడా ఇటీవలే బయటపడింది. అంటే కాంగ్రెస్ కి రాజీనామా చేయడం, బయటకొచ్చి కేసీఆర్ ని విమర్శించడం, ఓ ప్లాన్ ప్రకారం బీజేపీలో చేరడం.. ఇలా రాజగోపాల్ రెడ్డి వేసే ప్రతి అడుగు వెనక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే విషయం తేటతెల్లమైంది. ఇప్పుడీ "కాంట్రాక్ట్ పే" పోస్టర్లు రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ ని మరింతగా డ్యామేజీ చేస్తున్నాయి. కాంట్రాక్ట్ వర్క్ లు, ఇతరత్రా వ్యవహారాల గురించి అవగాహన లేని సామాన్య ప్రజలకు కూడా "కాంట్రాక్ట్ పే" అంటూ పోస్టర్లు వేసి విషయాన్ని వివరించేస్తున్నారు. ఈ పోస్టర్లపై రాజగోపాల్ రెడ్డి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

First Published:  11 Oct 2022 2:59 AM GMT
Next Story