Telugu Global
Telangana

కాంట్రాక్ట్ పే పోస్టర్లు.. చండూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మంటలు..

పోస్టర్లు పడిన కాసేపటికే చండూరులోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాలిపోవడం, అందులోని ప్రచార సామగ్రి దగ్ధమవడంతో కలకలం రేగింది. నిందితుల్ని పట్టుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

కాంట్రాక్ట్ పే పోస్టర్లు.. చండూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మంటలు..
X

ఈరోజు తెల్లవారు జామున చండూరు మండలంలో కాంట్రాక్ట్ పే అనే పోస్టర్లు వెలుగుచూశాయి. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ పోస్టర్లు వేశారు. ఆయన 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులకు అమ్ముడుపోయారంటూ సెటైరిక్ గా ఆ పోస్టర్లు వేశారు. అయితే ఈ పోస్టర్ల వెనక ఎరున్నారనే విషయం మాత్రం బయటకు రాలేదు. కానీ రాజగోపాల్ రెడ్డి అనుచరులు, అది కాంగ్రెస్ పార్టీ పనేనంటూ ఆరోపిస్తున్నారు, అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో చండూరు పార్టీ కార్యాలయాన్ని కొంతమంది తగలబెట్టారు. అందులోని ప్రచార సామగ్రి తగలబడిపోయింది. అందులోనే కాంట్రాక్ట్ పే పోస్టర్లు కూడా ఉన్నాయనే అనుమానాలున్నాయి. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ని తగలబెట్టినవారిని 24గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయ కక్షలతోనే పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దగ్ధం చేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీస్ ముందు తానే స్వయంగా ధర్నా చేస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగలబెట్టినా.. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

తమ క్యాడర్‌ని బెదిరించేందుకు టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు పనుతున్నాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. వారి బెదిరింపులకు తాము బెదిరేదే లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామన్నారు రేవంత్ రెడ్డి. చండూరులో సోమవారం రాత్రి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు పడ్డాయి. తెల్లవారే సరికి ఆ వార్త సంచలనంగా మారింది. 18వేల కోట్ల కాంట్రాక్ట్ పనులొచ్చాయంటూ రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఓ టీవీ డిబేట్ లో చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పుడీ పోస్టర్లతో తన ఇమేజ్ మరింత డ్యామేజీ అయిందని భావిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. పోస్టర్లు పడిన కాసేపటికే చండూరులోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాలిపోవడం, అందులోని ప్రచార సామగ్రి దగ్ధమవడంతో కలకలం రేగింది.

First Published:  11 Oct 2022 9:56 AM GMT
Next Story