Telugu Global
Telangana

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ గెలుస్తుంది : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ గెలుస్తుంది : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన మనసులో ఏదీ దాచుకోరు. సొంత పార్టీపై విమర్శలు చేసినా, ప్రత్యర్థి పార్టీని పొగడ్తలతో ముంచెత్తినా జగ్గారెడ్డికే చెల్లుతుంది. ఇటీవల వైఎస్ షర్మిల తనపై విమర్శలు గుప్పిస్తే.. వారింట్లో జరుగుతున్న విషయాలన్నీ బయటపెట్టి సంచలనం సృష్టించారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కూడా విమర్శలు చేస్తుంటారు. అప్పుడప్పుడు సీఎం కేసీఆర్‌ను పొగుడుతుంటారు.

తాజాగా జగ్గారెడ్డి మరో బాంబు పేల్చారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నెంబర్ 2 పొజిషన్‌లో ఉంటుందని.. కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న డ్రామాలకు ఓట్లు పడవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను చెప్పిన ఫలితాలు తప్పకుండా వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో సమష్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయన అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ సమష్టి నిర్ణయాలని అబద్దాలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ సమావేశాల్లో తప్పకుండా రేవంత్ తీరును ప్రస్తావిస్తానని జగ్గారెడ్డి అన్నారు. అయితే ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారని చెప్పారు. రేవంత్ రెడ్డి మీడియాకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారో తాను అడుగుతానని చెప్పారు.

కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొని రావడానికి రేవంత్ పాదయాత్ర చేస్తే తప్పకుండా సహకరిస్తానని అన్నారు. రేవంత్ రెడ్డి అధిష్టానం అనుమతితోనే పాదయాత్ర చేస్తే పార్టీలో ఉన్న వాళ్లందరూ తప్పకుండా మద్దతు తెలుపుతారని చెప్పుకొచ్చారు. రేవంత్‌తో కలిసి నడవటానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. కాకపోతే సొంత ఎజెండాతో కాకుండా అందరినీ కలుపుకొనిపోతూ పాదయాత్ర చేయాలని సలహా ఇచ్చారు.

First Published:  29 Nov 2022 11:46 AM GMT
Next Story