Telugu Global
Telangana

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం.. తెలంగాణలో చేరికలపై తుది నిర్ణయం!

పార్టీ కోసం పని చేస్తున్న వారికి ఎలాంటి నష్టం జరగకుండా చేరికలు ఉండేలా అధిష్టానం ముందు జాగ్రత్తలు తీసుకుంటుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం.. తెలంగాణలో చేరికలపై తుది నిర్ణయం!
X

తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించి సోమవారం ఢిల్లీలో అధిష్టానం కీలక సమావేశం నిర్వహించనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చించడమే కాకుండా.. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్న వారి చేరికలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులతో అధిష్టానం పలు విషయాలను చర్చించనున్నది. ఇక కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖంగా ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్టారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు వారి మద్దతుదారులతో కూడా అధిష్టానం సమావేశం కానున్నది.

జూపల్లి, పొంగులేటి చేరికల వల్ల తమకు నష్టం కలుగుతుందని.. ఎంతో కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న తమను సంప్రదించకుండానే వారికి చేర్చుకుంటున్నారని ఖమ్మం, కొల్లాపూర్‌కు చెందిన పలువురు నేతలు ఫిర్యాదులు చేశారు. వాటిని కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. పార్టీ కోసం పని చేస్తున్న వారికి ఎలాంటి నష్టం జరగకుండా అధిష్టానం ముందు జాగ్రత్తలు తీసుకుంటుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

ఇక బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్‌లో చేరాలని ఆసక్తి చూపిస్తున్న వారి విషయాన్ని కూడా అధిష్టానం చర్చించనున్నది. వారి చేరిక వల్ల పార్టీకి కలిగే ప్రయోజనాలు, నష్టాలను అంచనా వేయనున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నాయకులకు ఎలాంటి నష్టం లేకుండా చేరికలు ఉండాలని ఏఐసీసీ సూచిస్తోంది.

కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వారు కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తున్నది. ఖమ్మంలో జూలై 2న నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటీ, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పొంగులేటి వర్గం జన సమీకరణకు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

First Published:  25 Jun 2023 4:15 AM GMT
Next Story